ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరా హోరీనే.. !
రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది.
రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో నామినేషన్ దాఖలు చేసిన 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అయింది. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీపడనున్నారు. మొత్తం 54 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఎన్నికల అధికారుల పరిశీలనలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
మరో 8 మంది పోటీ నుంచి తప్పుకోవడంతో 35 మంది బరిలో మిగిలారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్ట భద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల్లో గురువారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. దీంతో తుదిపోరులో 25 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ హోరా హోరీగానే సాగనుందని తెలుస్తోంది.
వాస్తవానికి ఏకపక్షం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులను, స్వ తంత్రులను కూడా వెనక్కి తగ్గించే ప్రయత్నాలు జరిగినా.. ఎక్కడా ఎవరూ ఆ దిశగా అడుగులు వేయలే దు. పైగా.. ఎవరికి వారే.. బలమైన ఓటు బ్యాంకు ఉందని పేర్కొంటున్నారు. దీంతో కీలకమైన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి సర్కారుకు, ముఖ్యంగా టీడీపీకి చాలా పరీక్షే పెడుతున్నాయని అంటు న్నారు పరిశీలకులు.
గుంటూరు-కృష్ణా జిల్లాల విషయానికి వస్తే.. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారు. ఈయనకు కూటమి నుంచి సహకారం నామమాత్రంగానే కనిపిస్తోంది. పైకి అందరూ బాగానే ఉన్నా.. ఆయన వెంట నడుస్తున్న వారిని పరిశీలిస్తే.కొద్ది మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా కూటమి నేతలు జై కొడుతున్నారు. ప్రచారానికి ఇంకా సమయం ఉందని కొందరు.. ఇప్పుడే కాదు.. అసలు వ్యూహం ముందుందని మరికొందరు చెబుతున్నారు. దీంతో రాజా వెంట స్వల్ప సంఖ్యలోనే నాయకులు కనిపిస్తున్నారు.
ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. పేరాబత్తుల రాజశేఖరం పరిస్థితి బాగానే ఉంది. కూటమి నాయకులు సఖ్యతగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అయితే.. చివరి నిముషం వరకు.. ఈ తరహా పరిస్థితి ఉంటుందో ఉండదో చూడాలి. అయితే.. వైసీపీకి చెందిన కొందరు నాయకులు పేరాబత్తు లకు అనధికార మద్దతు ప్రకటించారన్న ప్రచారం ఊపందుకుంది. అయినప్పటికీ.. బరిలో స్వతంత్రులు ఎక్కువగా ఉండడంతో పేరాబత్తుల కూడా చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.