లడ్డూ వివాదం...తిరుమలకు భక్తులు తగ్గారా ?

అదే సమయంలో తిరుమల ప్రతిష్ఠను తగ్గిస్తారా అని వైసీపీ వంటి పార్టీలు విమర్శలు చేశాయి.

Update: 2024-09-29 14:30 GMT

ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. లడ్డూ ప్రసాదం విషయంలో అపవిత్రం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 18న ఎన్డీయే సమావేశంలో ప్రకటించారు. అంతే అది నిప్పు రవ్వలా రాజుకుంది.

పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ విషయంలో అపచారం జరిగింది అన్న వార్తలతో శ్రీవారి భక్త కోటి అంతా షాక్ తిన్నారు. వారి మనోభావాలు దెబ్బ తిన్నాయి. అదే సమయంలో తిరుమల ప్రతిష్ఠను తగ్గిస్తారా అని వైసీపీ వంటి పార్టీలు విమర్శలు చేశాయి.

ఇక హిందూ ధార్మిక సంస్థల గురించి చెప్పాల్సినది లేదు. తిరుమలలో చాలా ఏళ్ళుగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో అసలు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఈ వార్తల తరువాత తిరుమలలో లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్నది చూస్తే చాలా ఆసక్తిని కలిగించే విషయాలు చోటు చేసుకున్నాయి.

తిరుమలలో యధా ప్రకారం రద్దీ కొనసాగుతూనే ఉంది. ఒక వైపు వివాదాలు నడుస్తూన్నా ఎక్కడా భక్తులు తగ్గలేదు. ప్రసాదాల అమ్మకాల గిరాకీ కూడా ఎక్కడా తగ్గలేదు. లడ్డూలు కావాలని భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం విశేషం.

ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని 18న చెబితే 19వ తేదీన తిరుమలలో 3 లక్షల 59,660 లడ్డూలు విక్రయం జరిగాయి. ఇక 20వ తేదీన చూస్తే 3,17,954 లడ్డూలు, 21న 3,67,607 లడ్డూలు, 22న 3,46,640 లడ్డూలు, 23న 3,08,744 లడ్డూలు, 24న 3,02,174 లడ్డూలు, 25న 3,10,423 లడ్డూల విక్రయాలు జరిగాయని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అంటే ఏ రోజూ కూడా మూడు లక్షలకు తక్కువ కాకుండా లడ్డూలు అమ్ముడు పోయాయన్నమాట. లడ్డూ వివాదంతో అమ్మకాల జోరు తగ్గుతుందని కొంత సందేహం ఉన్నా అవన్నీ తప్పు అని తేలిపోయింది. భక్తులు అయితే స్వామి వారి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తింటున్నారు. అలాగే రోజుకు డెబ్బై వేలకు తగ్గకుండా సగటున భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

ఇక లడ్డూలకు వాడే నెయ్యిలో కల్తీ చేశారని టెస్టుల్లో నిరూపితం కావడంతో వాటిని పంపించేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తక్షణ చర్యలకు ఉపక్రమించింది. కర్ణాటక నందిని డెయిరీ నుంచి నెయ్యికి ఆర్డర్ తీసుకుంది.

ఇక లడ్డూలలో నాణ్యతను కూడా పెంచేందుకు కృషి చేసింది. ఫలితంగానే ఇపుడు లడ్డూలకు డిమాండ్ మరింతగా పెరిగింది అని అంటున్నారు. తెప్పిస్తోంది. ఏది ఏమైనా శ్రీవారితో భక్తుల అనుబంధం ప్రత్యేకమైనది అని అంటున్నారు. అందుకే ఆలయ ఉపచారాలలో అపచారాల మీద అనుమానాలు ఉన్నా కూడా దేవుడే అన్నీ చూసుకుంటాడు అన్నది భక్తుల నమ్మకం ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తారు అని కూడా నూరు శాతం భక్తులు నమ్ముతారు. మొత్తానికి చూస్తే శ్రీవారి లడ్డూల వివాదం ఆధ్యాత్మికపరంగా చూస్తే కొంత అలజడి రేపినా భక్తులు మాత్రం ఆ స్వామి సేవలో తరిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News