ఢిల్లీలో దారుణం.. 18 మంది మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్ర్యాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్ర్యాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు! మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారని అంటున్నారు! ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అవును... శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. 14, 15 ఫ్లాంట్ ఫామ్ లపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో... ఈ ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మరోపక్క తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధృవీకరించారు.
ఈ సందర్భంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్... తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని.. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం... రైల్వే అధికారులు ప్రయాగ్ రాజ్ కోసం ప్రతీ గంటకు సుమారు 1,500 జనరల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు!
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జాతీయ మీడియా నివేదిక ప్రకారం... శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైలు ఎక్కడానికి వందలాదిమంది ప్రయాణికులు 14వ ఫ్లాట్ ఫామ్ వద్ద వేచి ఉండగా.. అదే సమయంలో న్యూఢిలీ టు దర్భంగాకు నడిచే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ లో ఎక్కడానికి పక్కనే ఉన్న 13వ ఫ్లాట్ ఫామ్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడారు!
అయితే... ఈ స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా అర్ధరాత్రి బయలుదేరేలా షెడ్యూల్ చేయబడిందట. దీంతో.. ఆ ప్రయాణికులంతా ఫ్లాట్ ఫామ్ పైనే ఉండిపోయారు. మరోపక్క అదనపు టిక్కెట్ల అమ్మకాల ఫలితంగా 14వ ఫ్లాట్ ఫామ్ లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. ఈ సమయంలో నిలబడటనికి కూడా ఖాళీ లేకుండా పోయిందని చెబుతున్నారు.
సరిగ్గా ఈ సమయంలో... రాత్రి 10 గంటల ప్రాంతంలో రైల్వే అధికారులు ఫ్లాట్ ఫామ్ 16 నుంచి ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక రైలును ప్రకటించారు.. దీంతో ఫ్లాట్ ఫామ్ 14లో జనరల్ టిక్కెట్ కలిగి వేచి ఉన్న ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటి 16వైపు పరుగెత్తారు.. ఈ సమయంలో ఓవర్ బ్రిడ్జిపై కూర్చున్న ప్రయాణికులను తొక్కారని.. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్... ఈ ఘటన జరిగిన సమయంలో పాట్నాకు వెళ్తున్న మగధ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫామ్ 14పై నిలబడి ఉండగా.. జమ్మూకు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ఫ్లాంట్ ఫామ్ 15పై ఉంది. 14 నుంచి 15వరకూ వస్తున్న ఒక ప్రయాణికుడు జారి మెట్లపై పడిపోయాడు.. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది అని తెలిపారు!