2025.. 2 నెలలు.. తిరుమల నుంచి అమెరికా వరకు విపత్తులే విపత్తులు
2025..: 2+0+2+5.. మొత్తం కలిపితే 9. సంఖ్యా పరంగా చాలామందికి 9 లక్కీ అంటారు. ఈ ఏడాది 2025. మరి దీని ప్రకారం చాలా మంచి పరిణామాలు జరగాలి.
2025..: 2+0+2+5.. మొత్తం కలిపితే 9. సంఖ్యా పరంగా చాలామందికి 9 లక్కీ అంటారు. ఈ ఏడాది 2025. మరి దీని ప్రకారం చాలా మంచి పరిణామాలు జరగాలి. కానీ, సరిగ్గా 2 నెలలు తిరిగేసరికి 2025 విపత్తుల సంవత్సరంగా మిగిలిపోతుందా? అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
పవిత్ర ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రపంచ పెద్దన్న అమెరికా వరకు వరుసగా ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ యాక్సిడెంటల్ గానే జరిగినవే. కానీ, 2 నెలల్లోనే ఒకదాని వెనుక ఒకటి కావడంతో చర్చనీయాంశంగా మారాయి.
జనవరి 8న తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం నిరీక్షిస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం మొదలైందో లేదో.. ఈ ఘటన సంభవించడం కలకలం రేపింది.
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి జనవరి ముగుస్తుండగా అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొనడంతొ 67 మంది చనిపోయారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. మరో 60 మంది గాయపడ్డారు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికుల మధ్య ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15వ తేదీన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించారు.
గత మంగళవారం తెలంగాణలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ లో ప్రమాదం సంభవించింది. ఇందులో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు వీరి ఆచూకీ తెలియరాలేదు.
తాజాగా ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ ధామ్‌లోని జాతీయ హైవేపై శుక్రవారం ఉదయం మంచు చరియలు విరిగిపడి వాటికింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్‌వో క్యాంప్ సమీపంలో 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోగా 16 మందిని రక్షించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 41 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలటరీ మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఓమ్‌దుర్మాన్ లోని సబ్రీన్ మార్కెట్‌పై ఫిబ్రవరి 1న విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మార్కెట్ కు వచ్చిన 54 మంది మరణించారు.
ఇవేకాక అమెరికాలోనే ఒకటీ రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.