మానవ మెదడులాంటి ట్రాన్సిస్టర్... పరిశోధకుల అద్భుతం!
ఇందులో భాగంగా... అత్యున్నత స్థాయి ఆలోచన సామర్థ్యం కలిగిన "సినాప్టిక్ ట్రాన్సిస్టర్"ను అభివృద్ది చేశారు.
మానవ మెదడుతో అదే మెదడు కలిగిఉన్న శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు నేటివి కావు. ఎప్పటి నుంచో మానవ మెదడు, దాని పనితీరు, సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే విధానం, అనంతరం ఆ సమాచారాన్ని సరఫరా చేసే లక్షణం... మొదలైన అంశాలపై అలుపెరగని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మానవ మెదడు తరహాలో ఏకకాలంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడంతోపాటు నిల్వ కూడా చేయగల ట్రాన్సిస్టర్ ను అభివృద్ధి చేశారు.
అవును... అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ, బోస్టన్ కాలేజీ, మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా... అత్యున్నత స్థాయి ఆలోచన సామర్థ్యం కలిగిన "సినాప్టిక్ ట్రాన్సిస్టర్"ను అభివృద్ది చేశారు. ఇది మానవ మెదడు తరహాలో ఏకకాలంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడంతోపాటు నిల్వ కూడా చేయగలదు.
వాస్తవానికి గతంలోనూ మెదడు తరహా కంప్యూటర్ సాధనాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే నాడు వారు రూపొందించిన ట్రాన్సిస్టర్లు అత్యంత శీతల ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేశాయి. అయితే తాజా సినాప్టిక్ ట్రాన్సిస్టర్ మాత్రం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా పనిచేసింది. ఇదే సమయంలో అత్యంత వేగవంతమైన పనితీరునుకనబరచగలదు. ఒకవేళ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే.. అప్పటికే నిల్వ చేసిన సమాచారాన్ని సేవ్ చేసి ఉంచుతుంది.
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. ఏఐ తో దాదాపు అన్నీ సాధ్యమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని ఫలితాలు.. షాకింగ్ గా కూడా ఉంటున్నాయి. ఇది మానవ మనుగడను యాంత్రికం చేయబోతుందనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... మానవ మెదడును అనుకరించే కంప్యూటర్లను అభివృద్ధి చేసేలా శాస్త్రవేత్తల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫూర్తి నింపిందని చెప్పొచ్చు.
మెదడు తరహాలో ఏకకాలంలో డేటా నిల్వ, సమాచార ప్రాసెసింగ్ ను చేపట్టగల ట్రాన్సిస్టర్ రూపకల్పనకు "మోర్ ప్యాటర్న్స్"లో కొత్తగా వచ్చిన పురోగతిపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఈ విధానంలో రెండు రకాల ఆకృతులను.. ఒకదానిపై మరొకటి ఉంచుతారు. వీటి తయారీకి చాలా పలుచగా ఉండే బైలేయర్ గ్రాఫీన్, హెక్సాగోనల్ బోరాన్ నైట్రైడ్ ను ఉపయోగించారు.
ఈ సమయంలో వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి, మెలితిప్పారు. ఫలితంగా... మోర్ ఆకృతిని ఏర్పరిచారు. దీనివల్ల ఆ ఆకృతికి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద మానవ మెదడు తరహా "న్యూరోమార్ఫిక్ సామర్థ్యం" సాధ్యమైందని.. తద్వారా సరికొత్త సినాప్టిక్ ట్రాన్సిస్టర్ ను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.