మావోలకు మన్యంలో పట్టు పోతోందా ?
ఈ జిల్లాలోని పాడేరు నియోజకవర్గం జి మాడుగుల వారపు సంతలో సాధారణ ప్రజలు కాలేజీ విద్యార్థులు కలసి భారీ ర్యాలీ నిర్వహించారు.
మావోయిస్టులు అంటే హడలెత్తిన మన్యంలో మార్పు వస్తోందా. దీనిని చైతన్యానికి సూచికగా చూడాలా అన్న చర్చకు ఆస్కారం ఇచ్చే సంఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మావోలు నిర్వహిస్తున్న వారోత్సవాలు వ్యతిరేకంగా గళం విప్పింది పోలీసులు కాదు, ప్రజా సంఘాలు కాదు, సాధారణ విద్యార్థులు.
ఈ జిల్లాలోని పాడేరు నియోజకవర్గం జి మాడుగుల వారపు సంతలో సాధారణ ప్రజలు కాలేజీ విద్యార్థులు కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అన్ని ప్రాంతాలతో సమానంగా మన్యం అభివృద్ధి కావాలని వారు కోరుకున్నారు.
మావోల వల్ల మన్యం అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. మావోలు నిజంగా మన్య ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తే రోడ్లు గురించి రవాణా సౌకర్యం గురించి కమ్యూనికేషన్ గురించి మంచినీటి సౌకర్యం గురించి స్థానిక ప్రజలకు సహకరించి ఆ దిశగా పోరాటం చేయాలని కోరారు. అంతేగాని అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పుడు దానికి అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. మావోలకు మన్యం మీద ప్రేమ వింటే దేనికీ అడ్డుపడవద్దని ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్ధులు మావోలకు హితవు పలికారు.
ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నప్పుడు రోడ్లు వేస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం, అలాగే కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థను సెల్ టవర్లను ధ్వంసం చేయడం సరికాదని ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్ధులు అంటున్నారు.
ఒక విధంగా చూస్తే మావోలకు మన్య ప్రాంతాలలో మద్దతు క్రమంగా తగ్గిపోతోంది. ప్రజలు గతం కంటే మెరుగు అయ్యారని అంటున్నారు. అక్కడా స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ప్రపంచంలో ఏమి జరుగుతోంది అన్నది తెలుస్తోంది. నిజంగా అన్యాయమే జరిగితే దానికి వ్యతిరేకంగా పొరాడేందుకు ప్రపంచంలో చాలా మంది ఎంచుకుంటున్న మార్గాలని కూడా ప్రజలు గమనిస్తున్నారు.
తుపాకీలు తూటాలతోనే ఏదీ పరిష్కారం కాదని కూడా వారు గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు కూడా గతానికి భిన్నంగా మన్యంలో పట్టు పెరిగింది. ఇక రేపటి యువతగా భావిస్తున్న విద్యార్ధులతో ర్యాలీలని నిర్వహించడం ద్వారా మావోలకు ఉన్న పట్టుని పూర్తిగా తగ్గించాలన్నదే అధికారులు పోలీసుల ఆలోచనగా ఉంది. ఏది ఏమైనా మన్య ప్రాంతాలు జిల్లాలుగా మారడంతో పాలన మరింత దగ్గరకు వచ్చింది. ఇదే విధంగా సాగితే మాత్రం మావోలు తమ ఆలోచనలను తమ పోరాట పంధాను కూడా మార్చుకోక తప్పదని అంటున్నారు.