సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఒకరు మృతి మరింత మందికి గాయాలు
ఈ ఘటనలో విమాన ప్రయాణికులు ఒకరు మృతి చెందగా.. మరింత మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమాన ప్రయాణికులు ఒకరు మృతి చెందగా.. మరింత మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని విమానయాన సంస్థ ధ్రువీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొంది. లండన్ నుంచి సింగపూర్‌కు బయలు దేరిన బోయింగ్ 777-300ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితోపాటు 18 మంది సిబ్బంది కూడా ఉన్నారు.
అయితే... వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులతో సిగ్నళ్ల సమస్య ఎదురైంది. దీంతో బ్యాంకాక్‌లో దీనిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో ఒక ప్రయాణికులు మరణించగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఎంత మంది గాయపడ్డారనే విషయంపై సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనలో 30కి పైగా ప్రయాణికులు గాయపడి ఉంటారని మాత్రం వెల్లడించింది. గాయపడిన వారిని తక్షణ వైద్య సేవలు అందించేలా థాయ్‌లాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే సమయంలో థాయ్‌ల్యాండ్‌కు సిబ్బందిని పంపించి సహాయక చర్యలు కూడా చేపడుతున్నట్టు పేర్కొంది. కాగా, ఈ ఘటనకు కారణం.. అకస్మాత్తుగా విమానం ల్యాండింగ్ కావడంతోపాటు.. గాలి దిశ కూడా కారణమై ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విమానంలో భారీ కుదుపులు చోటు చేసుకున్నట్టు తెలిపింది. ఈ సమయంలో విమానంలో కూర్చున్న ప్రయాణికులు సీట్లలోనే ఎగిరి పడినట్టు భావిస్తున్నారు. కొందరు కాబిన్‌లోకి కూడా ఎగిరి పడినట్టు చెబుతున్నారు. 2000 సంవత్సరం తర్వాత.. చోటు చేసుకున్న ఘటన ఇదేనని సింగపూర్ ఎయిర్ లైన్స్ పేర్కొంది. అప్పట్లో 2000 సంవత్సరంలో ఒక విమానం.. రన్‌వే పై తైవాన్ విమానాన్ని ఢీ కొట్టింది. అప్పట్లో 83 మంది ప్రయాణికులు మృతి చెందారు.