కొత్త చట్టం ఎఫెక్ట్... దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన!
దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందేమోననే ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంక్ లపై ఎగబడుతున్నారు
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి వెల్ కం చెప్పిన వేళ దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసనకు దిగారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందేమోననే ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంక్ లపై ఎగబడుతున్నారు. అందుకు కారణం... కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త చట్టంలోని మార్పులే అని తెలుస్తుంది!
అవును... కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో "హిట్ అండ్ రన్" కేసులకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో... ఇంధన కొరత టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దీంతో.. వాహనదారులు బంకుల ముందు క్యూ కడుతున్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు కిటకిటలాడుతూ కనిపించాయి. ఇదే సమయంలో... హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, లద్దాఖ్ లోనూ దాదాపు ఇదే పరిస్థితి కన్పించింది. ఇక కొన్ని చోట్ల బంకుల వద్ద వందల మీటర్ల వరకు బారులు తీరిన వాహనాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోపక్క నిరసనకు దిగిన డ్రైవర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ పూరిత సంఘటనలు జరిగాయి.
ఇందులో భాగంగా... థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవే పై ట్రక్కు డ్రైవర్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. కొల్హాపూర్, షోలాపూర్, నాగ్ పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లను దిగ్బంధించారు. ఒక్క ఛత్తీస్ గఢ్ లోనే రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు.
దీంతో పలు బస్ స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది మార్గమధ్యలోనే ఉండిపోయి నరకం చూస్తున్నారు! ఇదే సమయంలో ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్.పీ.జీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో... ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.
కాగా... భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన భారత న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. ఆలాకానిపక్షంలో... పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.