రాజీనామా యోచనలో కెనడా ప్రధాని... భారత్ ఎఫెక్ట్ ఎంతంటే..?

2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Update: 2025-01-06 04:41 GMT

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగ మొదలైందని అంటున్నారు. ఇదే సమయంలో.. కెనడియన్ల నుంచి ట్రూడోకు రోజు రోజుకీ మద్దతు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారని.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనే తరువాయని కథనాలు వస్తున్నాయి.

అవును... 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు లిబరల్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలతో సమావేశం జరగనుందని అంటున్నారు. ఆ సమావేశంలోనే లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ట్రూడోను పక్కకు తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాబోయే 48 గంటల్లో లిబరల్ పార్టీ నాయకత్వ పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామాను ప్రకటించే అవకాశం ఉందని.. ఆయన ప్రధాని పదవికి కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. అయితే.. ప్రధాని పదవి నుంచి ఇప్పటికిప్పుడే వైదొలుగుతారా.. లేక, పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకునేవరకూ ఆగుతారా అనేది తెలియాల్సి ఉంది.

వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. తాజా పోల్స్ ప్రకారం.. తన ప్రధాన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియారీ పోయిలీవ్రే కంటే ట్రూడో 20 పాయింట్లు వెనుకబడి ఉన్నాడని తేలిందని.. దీంతో.. అతడు ఇంకా ఆ పదవిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ ఎంపీలు భావిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ట్రూడోను పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ తాత్కాలిక నాయకుడిగా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఆయనను ఈ 10 నెలలకు ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కాగా... ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సొంత పార్టీలోని ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అంటున్నారు. ప్రధానంగా... భారతదేశం పట్ల ట్రూడో వ్యవహరిస్తున్న తీరును సొంత పార్టీలోని పలువురు ఎంపీలు తప్పుబట్టారని.. జనం కూడా ట్రుడోను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వేల్లో తేలిందని చెబుతున్నారు.

Tags:    

Similar News