ట్రూడోకు సొంత ఎంపీల షాక్.. రాజీనామాకు డిమాండ్
రాజకీయ లబ్థి కోసం దేశ ప్రయోజనాల్ని పణంగా పెట్టేందుకు సైతం వెనుకాడని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ కో తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది.
రాజకీయ లబ్థి కోసం దేశ ప్రయోజనాల్ని పణంగా పెట్టేందుకు సైతం వెనుకాడని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ కో తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. బలమైన ఆధారాల్లేకుండా.. ప్రజల్లో సెంటిమెంట్ ను రగలించేందుకు వీలుగా వేసిన పొలిటికల్ ఎత్తుగడ ట్రూడోకు మిస్ ఫైర్ అయినట్లుగా మారింది. అవసరం లేకున్నా.. భారత్ మీద కాలు దువ్విన ఆయనకు సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసన సెగ ఎదురవుతోంది.
తాజాగా ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ఒకరు మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. కెనడా ప్రజలు ఇప్పటికే ఆయన్ను చాలా భరించారని.. ఇకనైనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లిబరల్ పార్టీ ఎంపీ సియాన్ కాసే తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రూడో వైదొలిగేందుకు టైం వచ్చేసిందన్న ఆయన..‘‘ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా’’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావటం.. కెనడియన్లతో పాటు సొంత పార్టీలోనూ వ్యతిరేకతను ట్రూడో ఎదుర్కొంటున్న ఆయన.. వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా లిబరల్ పార్టీ ఎంపీ సియాన్ కాసే డిమాండ్ చేసినట్లే.. ఈ ఏడాది జూన్ లో న్యూ బ్రన్స్విక్ ఎంపీ వేనె లాంగ్ కూడా ట్రూడో రాజీనామా కోసం డిమాండ్ చేయటం గమనార్హం. ఇంకో ఎంపీ కెన్ మెక్ డొనాల్డ్ కూడా ఆయన నాయకత్వాన్ని పున: సమీక్షించాలని పేర్కొన్నారు. ట్రూడో నాయకత్వంలో గతంలో మంత్రిగా పని చేసిన కేథరిన్ మెక్ కెన్నా కూడా పార్టీకి కొత్త నాయకత్వ అవసరాన్ని ప్రస్తావించటం గమనార్హం. మొత్తంగా సొంత ఇంటి మీద ఫోకస్ చేయల్సిన అవసరం ఇప్పుడు ట్రూడో మీద ఉంది. భారత్ మీద ఏడవటం మానేసి.. పనికి వచ్చే పనులు చేస్తే ట్రూడో కు మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.