గోల్డ్ కార్డ్ పై అసలు విషయం చెప్పిన ట్రంప్

ట్రంప్ ప్రకటన ప్రకారం, అమెరికా కంపెనీలు తమకు అవసరమైన ప్రతిభావంతులైన విద్యార్థులను నియమించుకునేందుకు గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చు.

Update: 2025-02-27 13:30 GMT

అమెరికా పౌరసత్వాన్ని ఆశించే వారికోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 కోట్లు) విలువ చేసే గోల్డ్ కార్డును ఆయన ప్రకటించారు. ఈ కార్డు ద్వారా పౌరసత్వాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇది కేవలం సంపన్న వలసదారులకు మాత్రమే పరిమితం కాదని ట్రంప్ స్పష్టంచేశారు.

-విద్యార్థులకు ప్రయోజనం

భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కూడా ఇది ప్రయోజనకరంగా మారనుంది. ప్రముఖ విద్యాసంస్థలు హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి చోట్ల చదువుకున్న ఉత్తమ విద్యార్థులు అమెరికాలోనే ఉండేందుకు ఈ గోల్డ్ కార్డు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న కంపెనీలు నంబర్‌వన్ విద్యార్థులను నియమించుకోవాలని కోరుకుంటున్నాయని, అలాంటి విద్యార్థుల కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు.

- కంపెనీలకు కూడా లాభం

ట్రంప్ ప్రకటన ప్రకారం, అమెరికా కంపెనీలు తమకు అవసరమైన ప్రతిభావంతులైన విద్యార్థులను నియమించుకునేందుకు గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఆ విద్యార్థులు అమెరికాలో ఉండి, స్థిరంగా పనిచేసే అవకాశాన్ని పొందుతారు. వారు మంచి ఉద్యోగాలు పొందడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించడంతో పాటు, భారీగా పన్నులు కడతారని ఆయన వివరించారు. వ్యాపార రంగానికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

- వ్యాపార రంగం నుంచి మంచి స్పందన

ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటనపై వ్యాపార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త గోల్డ్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం కల్పించడమే దీని లక్ష్యమని ఆయన వివరించారు.

-రెండు వారాల్లో అమలులోకి

ఈ కొత్త గోల్డ్ కార్డు విధానం రెండు వారాల్లో అమలులోకి రానుందని ట్రంప్ తెలిపారు. ఈ విధానం ద్వారా అమెరికాకు వచ్చే వలసదారులు సంపన్నులవుతారని, అమెరికా ఆర్థిక వ్యవస్థకూ మంచి లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త పథకం వలసదారుల కోసం మరింత అనుకూలంగా మారుతుందా అన్నది వేచిచూడాల్సిన విషయమే!

Tags:    

Similar News