ట్రంప్ - మోడీ ప్రకటనతో ఉలిక్కిపడ్డ పాక్... ఆ దేశ ప్రతినిధి ఆవేదన!

ఇదే సమయంలో ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2025-02-14 14:40 GMT

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... దేశాలుగా అమెరికా – భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యమని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా... సీమాంతర ఉగ్రవాదంపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. దీనిపై పాకిస్థాన్ గగ్గోలు మొదలుపెట్టింది.

అవును... సీమాంతర ఉగ్రవాదంపై ట్రంప్ - మోడీ సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సీమాంతర ఉగ్రవాదానికి తమ భూభాగం వాడుకోకుండా పాకిస్థాన్ చూసుకోవాలని ఇరు దేశాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తహవూర్ రాణా అప్పగింతకు తన కార్యవర్గం పచ్చ జెండా ఊపిందని.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్లో అతడు కూడా ఒకడని.. అతడు కచ్చితంగా భారత్ లో విచారణ ఎదుర్కోవాలని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత చేసిన సంయుక్త ప్రకటనలో పాక్ ఉగ్రవాదాన్ని తప్పుబట్టారు.

ఈ ప్రకటనలపై ఇస్లామాబాద్ లోని పాకిస్థాన్ విదేశాంగంశాఖ ప్రతినిధిస్పందించారు. ఈ సందర్భంగా... ఇది పూర్తిగా ఏకపక్షం అని.. తప్పుదోవ పట్టించేదని.. దౌత్య నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్థాన్ త్యాగాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని.. అలా తీసుకోకుండానే దీనిలో చేర్చారని అన్నారు.

ఈ నేపథ్యంలో.. ఇవేవీ భారత ప్రాయోజిత సీమాతంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం కప్పిపెట్టలేవని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... రక్షణ పరంగా భారత్ కు టెక్నాలజీ, ఆయుధాల సరఫరా పై కూడా పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు ప్రంతీయ సమతుల్యతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

కాగా... ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35 లైటెనింగ్-2 రకం యుద్ధ విమానాలను భారత్ కు అందించేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన పాక్ ను కలవరపాటుకు గురి చేస్తుందని అంటున్నారు!

Tags:    

Similar News