ట్రంప్ తాజా పిడుగు.. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్?
ఇప్పటికే వలసల విషయంలో కఠినంగా వ్యవహరించటం.. చట్టవిరుద్ధంగా ఉన్న వారిని వారి దేశాలకు పంపేయటం తెలిసిందే.;
దూకుడు నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారికంగా నిర్ణయం తీసుకోనప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వలసల విషయంలో కఠినంగా వ్యవహరించటం.. చట్టవిరుద్ధంగా ఉన్న వారిని వారి దేశాలకు పంపేయటం తెలిసిందే. అంతేకాదు ఉద్యోగాల కోతలు.. దేశాలపై సుంకాలతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన తాజాగా పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధించాలని డిసైడ్ అయినట్లుగా మీడియా సంస్థలు సంచలన కథనాల్ని పబ్లిష్ చేశాయి.
తాజాగా వస్తున్న కథనాల ప్రకారం 41 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ ను విధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. అధికార ప్రకటన జారీ అయ్యే సమయానికి ఇందులో మార్పులు చేర్పులు ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఒక ఇంటర్నెల్ మెమో ప్రకారం మొత్తం 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించినట్లుగా తెలుస్తోంది. పది దేశాలతో ఉన్న మొదటి గ్రూపులో అఫ్గానిస్థాన్.. ఇరాన్.. సిరియా.. క్యూబా.. ఉత్తరకొరియా లాంటివి ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపేయనున్నారు. రెండో గ్రూపులో ఇరిట్రియా.. హైతీ.. లావోస్.. మయన్మార్.. దక్షిణ సూడాన్ దేశాలు ఉన్నాయి.ఈ దేశాల మీద పాక్షిఖంగా ఆంక్షలు అమలు చేస్తారని చెబుతున్నారు. ఈ దేశాలకు స్టూడెంట్ వీసాలతో పాటు.. టూరిస్టు వీసాలు కూడా జారీ చేయకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. తుది అధికారక ప్రకటనలో కొన్ని మినహాయింపులు కల్పించే వీలున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు గ్రూపులకు భిన్నంగా మూడో గ్రూపు ఉండనుంది. ఇందులో మొత్తం 26 దేశాలు ఉండనున్నాయి. అందులో పాకిస్థాన్.. భూటాన్ తో సహా ఇతర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు రానున్న 60 రోజుల్లో తమ లోపాల్ని సరిదిద్దుకోవాలని లేని పక్షంలో ఆయా దేశాల పౌరులకు వీసాల జారీని పాక్షికంగా నిలిపేస్తామంటూ యూఎస్ యంత్రాంగం భావిస్తున్నట్లుగా ఆ మెమోలో పేర్కొన్నారు.
అయితే.. ఈ మెమో బయటకు వచ్చిన తర్వాత.. తుది ప్రకటన సమయానికి అందులో కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాతనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో ట్రంప్ సర్కారు మరెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.