నేనా మాట అనలేదు.. జెలెన్ స్కీ నియంత కాదు.. ట్రంప్ టక్కరి
యుద్ధంతో బీభత్సం రేపిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కాదని.. యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని నియంతగా నిందించిన ట్రంప్ వారం తిరగకముందే మాట మార్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సగటు రాజకీయ నాయకుడే.. వ్యాపారం రంగం నుంచి వచ్చినా తొందరగానే రాజకీయం వంట బట్టించుకున్నారు. యుద్ధంతో బీభత్సం రేపిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కాదని.. యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని నియంతగా నిందించిన ట్రంప్ వారం తిరగకముందే మాట మార్చారు.
జెలెన్ స్కీని ఒక కమెడియన్ (గతంలో సినిమాల్లో నటించిన నేపథ్యాన్ని ఎగతాళి చేస్తూ) అని.. ఆయనకు కనీసం 5 శాతం ప్రజల మద్దతు కూడా లేదని.. అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదని నానా మాటలు అన్న ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు..
ఉక్రెయిన్ లోని విలువైన ఖనిజాలపై కన్నేసి.. డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్న ట్రంప్.. ఇప్పుడు జెలెన్ స్కీని నెత్తికెత్తుకుంటున్నారు. ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
జెలెన్ స్కీని నియంత అని అనలేదని ట్రంప్ మాట మార్చారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశారు. ఇద్దరూ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెలెన్ స్కీని మీరు తిట్టారు కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. తాను అలా అన్నానా? అని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ అలా అని ఉంటే నమ్మలేకపోతున్నా అని సమర్థించుకున్నారు. శుక్రవారం తామిద్దరి మధ్య జరిగే చర్చలు మంచి సంభాషణగా భావిస్తున్నట్లు తెలిపారు.
రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ట్రంప్ తప్పుబట్టారు. కొంత భూమితో పోయేదాన్ని యుద్ధం దాక ఎందుకు తెచ్చారని నిందించారు. మూడేళ్ల యుద్ధం అనంతరం ఇంకా చాలా భూమితో పాటు భారీ సంఖ్యలో సైనికుల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడిని తప్పుబట్టారు.
శుక్రవారం రాత్రి (అమెరికా టైం ప్రకారం శనివారం) ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ కానున్నారు. ఉక్రెయిన్ లోని విలువైన ఖనిజాల తవ్వకంపై అమెరికాతో ఒప్పందం కుదిరినట్లే. ఈ మేరకు ఒప్పందాలపై సంతకం చేసేందుకే జెలెన్ స్కీ అమెరికాలో కాలుపెట్టారు. తద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం కొనసాగతుందని భావిస్తున్నారు.
అరుదైన ఖనిజాలతో పాటు చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా సగం ఉక్రెయిన్ సహజ వనరులపై ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. అయితే, ఇది రెండో ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ పై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని బ్రిటన్ మీడియా తప్పుబడుతోంది. ఇక ఉక్రెయిన్ లో పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలపై అమెరికాదే పెత్తనం అంటూ విమర్శించింది. ఇది ఉక్రెయిన్ కు నష్టమేనని పేర్కొంది.