ట్రూడో రాజీనామా వేళ ట్రంప్ వెటకారం అలా ఉంది!
ఈ నేపథ్యంలో అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ట్రూడో రాజీనామాకు గల కారణాన్ని తనదైన శైలిలో విశ్లేషించారు.
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లిబరల్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధానమంత్రి పదవికీ జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ట్రూడో రాజీనామాకు గల కారణాన్ని తనదైన శైలిలో విశ్లేషించారు.
అవును... లిబరల్ పార్టీ అధ్యక్షుడు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతల ఒత్తిడి మేరకే ట్రూడో రాజీనామా అనే కథనాలు వెలువడ్డాయి. ఈ సమయంలో కెనడా ప్రధాని రాజీనామాపై ట్రంప్ స్పందించారు.
ఇందులో భాగంగా... అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా ఉండటం ఆ దేశంలోని చాలా మంది ప్రజానికానికి ఇష్టమే అని మొదలుపెట్టిన ట్రంప్.. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి తమ దేశం నష్టపోవాల్సిన అవసరం ఇక ఎక్కువ కాలం లేదని అన్నారు. ఈ విషయంలో ఆ దేశ ప్రధానికి తెలుసు కాబట్టే.. తన పదవికి రాజీనామా చేశారని అన్నారు.
ఇదే సమయంలో... అమెరికాలో కెనడా భాగమైతే ఇకవారికి సుంకాలు ఉండవు సరికదా పన్నులు కూడా తగ్గుతాయని.. అంతేకాకుండా.. చైనా, రష్యాలకు సంబంధించిన నౌకల నుంచి ఎలంటి ముప్పు ఉండదని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో రాసుకొచ్చారు. దీంతో.. ట్రూడోను ట్రంప్ ట్రోల్ చేస్తున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... ఇటీవల మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం కెనడా ప్రధాని ట్రూడోతో ట్రంప్ భేటీ అయ్యారు. కెనడా నుంచి యూఎస్ కు జరుగుతున్న అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లో కట్టడి చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించారు.
ఈ విషయంలో విఫలమైతే అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రూడోకు షాకిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రూడో రాజీనామా చేయడంతో.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా చేరడం ఆ దేశ ప్రజలకు ఇష్టమే అని.. అందుకే ఆయన రాజీనామా అంటూ కామెంట్స్ చేశారు! దీంతో.. కెనడాను కలిపేసుకునే విషయంలో ట్రంప్ సీరియస్ గానే ఉన్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.