‘నాటో’ మాట మర్చిపో.. ఉక్రెయిన్ కు ట్రంప్ క్లియర్ కట్ మెసేజ్

నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో).. ఇదొక సైనిక కూటమి. ఇందులో సభ్యులైన దేశాలు అన్నీ ఒప్పుకొంటేనే మరో కొత్త సభ్య దేశాన్ని చేర్చుకునే అవకాశం ఉంటుంది.

Update: 2025-02-27 19:30 GMT

నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో).. ఇదొక సైనిక కూటమి. ఇందులో సభ్యులైన దేశాలు అన్నీ ఒప్పుకొంటేనే మరో కొత్త సభ్య దేశాన్ని చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా.. కొత్తగా మరో దేశాన్ని చేర్చుకునే వీలుండదు. ఇక కూటమిలోని సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే.. అది ‘నాటో’పై చేసే దాడిగానే పరిగణించి ‘నాటో’ సైన్యమే నేరుగా రంగంలోకి దిగుతుంది.

ఇంతటి క్లిష్టమైన నాటో సభ్యత్వాన్ని ఇస్తామని ఊరించి ఉక్రెయిన్ ను రష్యాకు వ్యతిరేకంగా మార్చాయి పాశ్చాత్య దేశాలు. ఉక్రెయిన్ గనుక నాటో సభ్యురాలు అయితే నాటో దళాలు ఆ దేశంలో ఉంటాయి. అంటే.. ఆగర్భ శత్రువైన అమెరికా ఆధ్వర్యంలోని సైనిక బలగాలు రష్యా పొరుగునే ఉన్నట్లు. అందుకనే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై ఉరిమారు. మూడేళ్ల కిందట యుద్ధం మొదలుపెట్టి ఉక్రెయిన్ ను సర్వ నాశనం చేశారు.

యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఉక్రోయిన్ కు నాటో సభ్యత్వం అదిగో ఇదిగో అంటూ ఊరించిన అమెరికా, నాటో దేశాలు ఇప్పటికీ దానిని తేల్చలేదు. తాజాగా ఉక్రెయిన్‌ ఇక నాటో సభ్యత్వాన్ని మర్చిపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ త్వరలో తనతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.

అధికారంలోకి వచ్చాక తొలిసారి కార్యవర్గంతో సమావేశమైన

ట్రంప్.. ఉక్రెయిన్‌ సమస్యపై స్పందించారు. ‘నాటోనా..? దానిని మర్చిపోవచ్చు. సంక్షోభం అంతా దాంతోనే మొదలైంది. మేం అత్యుత్తమ పనే చేయాలని భావిస్తున్నాం.

ఇద్దరికీ (రష్యా-ఉక్రెయిన్) ఉత్తమ సంధి కుదురుస్తాం. ముఖ్యంగా ఉక్రెయిన్‌ కు మంచి సంధి కుదిరేలా చేసి.. కోల్పోయిన దానిలో.. వీలైనంత ఎక్కువ వెనక్కు ఇప్పిస్తాం’’ అని ట్రంప్ అన్నారు.

శాంతి కోసం పుతిన్‌ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని ట్రంప్ సూచించారు. ఖనిజాలపై ఒప్పందం కోసం ఈ నెల 28న జెలెన్‌స్కీ అమెరికా వస్తారని తెలిపారు. అరుదైన ఖనిజాలపై చేసుకునే చాలా పెద్ద ఒప్పందంగా దీనిని అభివర్ణించారు. మొదట్లో అంగీకరించనప్పటికీ ఉక్రెయిన్‌.. తాజాగా సవరణలతో ఆమోదించింది. ఇక ఈ ఒప్పందం ద్వారా.. అమెరికా సైనిక సాయం ఆగిపోకుండా చూడొచ్చని ఉక్రెయిన్‌ ఆశిస్తోంది.

కొసమెరుపు: ఉక్రెయిన్ కు చెందిన చాలా భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఇందులోనే అమెరికా కోరుకుంటున్న ఖనిజాలు ఎక్కువ శాతం ఉన్నాయట. అంటే.. ఇప్పుడు ఉక్రెయిన్ తో పాటు రష్యాతోనూ అమెరికా డీల్ కుదుర్చుకోవాల్సి ఉంటుందేమో?

Tags:    

Similar News