హలో మిత్రమా పుతిన్.. యుద్ధంపై ముందుకెళ్లొద్దు.. చెవిలో ట్రంప్ మాట
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొద్దని సూచించారు. ఓ విధంగా చెప్పాలంటే పుతిన్ కూ ఈ సూచన నచ్చే ఉంటుంది.
అందరూ అనుకున్న మాట.. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గనుక అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైతే ప్రపంచంలో జరుగుతున్న రెండు యుద్ధాలు ఆగుతాయని.. శాంతి నెలకొంటుందని.. చివరకు ట్రంప్ గెలిచారు.. యుద్ధాలపై ప్రజలు ఆశించినట్లుగానే శాంతి వచనం వినిపించింది. రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక మార్పు జరగనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆ మేరకు తాజాగా చోటుచేసుకున్న పరిణామం కీలకంగా మారింది.
మిత్రమా పుతిన్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడనే సంగతి తెలిసిందే. 2016లో ట్రంప్ గెలుపునకు రష్యా సహకరించింది అనే ఆరోపణలున్నాయి. ఈసారి కూడా అమెరికా ఎన్నికల్లో రష్యా వేలు పెడుతుందనే ఊహాగానాలు వ్యాపించినా.. అదేమీ లేకుండానే ట్రంప్ ఘన విజయం సాధించారు. కాగా, తాను 2020లో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగేది కాదని ట్రంప్ అంటుండేవారు. మరిప్పుడు ఆ యుద్ధాన్ని ఆపే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఉక్రెయిన్ ను ఎగదోసి..
వాస్తవానికి నాటో సభ్యత్వం పేరిట ఉక్రెయిన్ ను ఊరించి.. యుద్ధానికి రష్యాను ఎగదోసి ఆపై రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేస్తూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చోద్యం చూస్తున్నాయి. ఇక ఇప్పటికీ యుద్ధం ముగియలేదు. రష్యా వెనక్కుతగ్గడం లేదు. ఉక్రోయిన్ మాత్రం కోలుకోలేనంత నష్టం పోయింది. 40 శాతం భూభాగాన్ని రష్యాకు కోల్పోయింది. కాగా, ఈ క్రమంలో పుతిన్ కు ట్రంప్ ఫోన్ చేశారు.
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొద్దని సూచించారు. ఓ విధంగా చెప్పాలంటే పుతిన్ కూ ఈ సూచన నచ్చే ఉంటుంది. గత నెలలో రష్యా రోజుకు 1500 మంది సైనికులను కోల్పోయినట్లు కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే.. మరింత నష్ట నివారణకు పుతిన్ తన మిత్రుడు ట్రంప్ చెప్పిన మాట వింటారేమో?