అమెరికానా? అబ్బో వద్దు!

ఒకప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమమైన వస్తువులు ఎక్కడ తయారైనా నేరుగా అమెరికా గడ్డపైకి దిగుమతి అయ్యేవి.;

Update: 2025-04-09 02:30 GMT
అమెరికానా? అబ్బో వద్దు!

ఒకప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమమైన వస్తువులు ఎక్కడ తయారైనా నేరుగా అమెరికా గడ్డపైకి దిగుమతి అయ్యేవి. లగ్జరీ కార్ల నుంచి మొదలుకొని ఖరీదైన వాచ్‌ల వరకు, హైటెక్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఆట బొమ్మల వరకు ప్రతి ఒక్కటీ అమెరికన్ వినియోగదారులను అలరించేది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అనేక విలాసవంతమైన బ్రాండ్లు ఇప్పుడు అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు విముఖత చూపుతున్నాయి. ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఉత్పత్తుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

- లగ్జరీ కార్లకు అమెరికా 'నో':

ఐరోపా , ఇతర దేశాలలో తయారయ్యే లగ్జరీ కార్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనేక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు షిప్‌మెంట్‌లను నిలిపివేశాయి. టాటా గ్రూప్నకు చెందిన జాగ్వార్ , ల్యాండ్ రోవర్ సంస్థలు తమ కార్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నప్పటికీ, 10 శాతం టారిఫ్‌ల రిస్క్ కారణంగా అమెరికాకు ఎగుమతులు నిలిపివేశామని స్పష్టం చేశాయి. "మాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారికి మా కార్లను అందించడమే మా ప్రధాన లక్ష్యం. అదే సమయంలో అమెరికా విధించిన కొత్త వ్యాపార నిబంధనలకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తాం" అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన ఫోక్స్‌వాగన్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆడి, పోర్షే, బెంట్లీ, స్కోడా మరియు లంబోర్ఘినీ వంటి విలాసవంతమైన బ్రాండ్లు ఈ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలోని డీలర్‌షిప్‌లలో తమకు 37 వేల వాహనాల నిల్వ ఉందని, ఇది దాదాపు రెండు నెలల వరకు సరిపోతుందని ఫోక్స్‌వాగన్ ప్రతినిధి పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లోటస్ కూడా అమెరికాకు ఎగుమతులు నిలిపివేసిన కంపెనీల జాబితాలో చేరింది. మరోవైపు, నిస్సాన్ సంస్థ మెక్సికోలో తయారుచేస్తున్న ఇన్ఫినిటీ ఎస్‌యూవీల కోసం అమెరికాలో కొత్త ఆర్డర్‌లు తీసుకోవడం లేదు.

-హైటెక్ వస్తువులు, సీటీ స్కాన్‌లపై చైనా ఆంక్షలు:

ఎలక్ట్రానిక్స్ , హైటెక్ వస్తువుల తయారీలో కీలకమైన ఏడు అరుదైన ఖనిజాల ఎగుమతిని అమెరికాకు తగ్గించాలని చైనా నిర్ణయించింది. ఈ ఖనిజాలను లేజర్‌లు, శక్తివంతమైన మాగ్నెట్‌లు, జెట్ ఇంజిన్ కోటింగ్లు , టెస్లా కార్ల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా సీటీ స్కాన్‌లలో ఉపయోగించే ఎక్స్‌రే ట్యూబ్‌ల ఎగుమతులపై కూడా బీజింగ్ దర్యాప్తు ప్రారంభించింది. ట్రంప్ ప్రభుత్వం చైనాపై 34 శాతం ప్రతీకార పన్నులు విధించిన నేపథ్యంలో ఈ చర్య అమెరికా వైద్య రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

- స్విస్ వాచ్‌లకూ బ్రేక్

అమెరికాకు విలాసవంతమైన స్విస్ వాచ్‌ల ఎగుమతులు కూడా ఆగిపోయాయి. రోలెక్స్, బ్రైటెలింగ్ , ఆడెమర్స్ పిగెట్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే వాషింగ్టన్‌కు తమ ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేశాయి. స్విట్జర్లాండ్‌పై ట్రంప్ 31 శాతం టారిఫ్‌లు విధించడంతో అవి అమల్లోకి వచ్చాక పరిస్థితిని అంచనా వేసి ఎగుమతి చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.

- ఆట బొమ్మలకు కొరత తప్పదా?:

అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన టోంకా ట్రక్స్, కేర్ బేర్స్ , లింకన్ లాగ్స్ వంటి ఆటబొమ్మల సరఫరా జూలై నాటికి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ సంస్థ తమ బొమ్మలను చైనాలో తయారు చేస్తుంది. ప్రస్తుతం అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతులను నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బేసిక్ ఫన్ సీఈఓ జే ఫోర్మన్ మాట్లాడుతూ "మేము మా ఉత్పత్తులను అమెరికాకు రవాణా చేసి అదనపు టారిఫ్‌ల రిస్క్‌లో పడలేము. 10 లేదా 20 శాతం టారిఫ్‌లను తట్టుకోగలము, కానీ 54 శాతం నుంచి 104 శాతం వరకు టారిఫ్‌లు అసాధ్యం" అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అమెరికాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ బొమ్మల కొరత తీవ్రంగా ఉండనుంది.

- వీడియో గేమ్స్‌కూ ఎదురుదెబ్బ:

జపాన్ నుంచి తయారయ్యే నింటెండో స్విచ్-2 వీడియో గేమ్ కన్సోల్ ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ది వెర్జ్ పత్రికకు నింటెండో వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగాల్సిన ప్రీ-ఆర్డర్‌లు కూడా నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది.

మొత్తం మీద ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా అనేక విలాసవంతమైన బ్రాండ్లు అమెరికా మార్కెట్‌కు దూరంగా ఉంటున్నాయి. ఇది రాబోయే రోజుల్లో అమెరికన్ వినియోగదారులకు ఈ ఉత్పత్తుల కొరతను సృష్టించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ పరిస్థితి అమెరికా యొక్క అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే, అమెరికన్ వినియోగదారులు తమకు ఇష్టమైన అనేక విలాసవంతమైన వస్తువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

Tags:    

Similar News