ట్రంప్ దెబ్బకి అమెరికా షాపింగ్ మాల్స్ కళకళ.. రేట్లు పెరగకముందే కొనేయండి బాబోయ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో అగ్రరాజ్యంలో ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరిగి, అనేక వస్తువుల ధరలు చుక్కలనంటనున్నాయి.;

Update: 2025-04-05 13:25 GMT
ట్రంప్ దెబ్బకి అమెరికా షాపింగ్ మాల్స్ కళకళ.. రేట్లు పెరగకముందే కొనేయండి బాబోయ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో అగ్రరాజ్యంలో ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరిగి, అనేక వస్తువుల ధరలు చుక్కలనంటనున్నాయి. దీంతో అమెరికన్లు ధరలు పెరగకముందే షాపింగ్ చేసేందుకు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ట్రంప్ ఏకంగా 32 శాతం సుంకాలు విధించడంతో వాటి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కార్లు, ఇతర గృహోపకరణాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని సంబంధిత కంపెనీలు చెబుతున్నాయి.

"నేను ఏడాది కాలంగా కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నాను. తైవాన్ బ్రాండ్‌ అయితే బాగుంటుందని అనుకున్నాను. ఇప్పుడు ధర పెరగనుండటంతో ట్రంప్ సుంకాలు ప్రకటించిన రోజే ఆర్డర్ పెట్టాను" అని టెక్సాస్‌కు చెందిన జాన్ గుటిరెచ్ అనే యువకుడు తెలిపాడు. ఈ టారీఫ్ కారణంగా అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి కూడా దారితీయవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం మార్కెట్ పతనమైనా ఏం ఫర్వాలేదని, అమెరికా సంపన్న దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి నుంచి ఈ సుంకాలను వసూలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లలో బేస్‌లైన్ అయిన 10 శాతాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని అమెరికా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీంతో అమెరికాలోని సముద్ర పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కస్టమ్స్ వేర్‌హౌస్‌ల వద్ద దిగుమతులపై సుంకాల వసూలు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

అయితే, యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ బులిటెన్ ప్రకారం.. కొన్ని దిగుమతులకు 51 రోజుల గ్రేస్ పీరియడ్ వర్తించనుంది. టారిఫ్‌ల అమలు సమయానికి ముందే నౌకలు, విమానాల్లో లోడ్ అయి, రవాణా మధ్యలో ఉన్న కార్గోలకు ఈ మినహాయింపు కల్పించారు. అయితే ఈ కార్గోలన్నీ మే 27లోగా అమెరికాకు చేరుకుంటే 10 శాతం సుంకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News