ట్రంప్-జెలెన్ స్కీ ఫైట్ : వాగ్వాదం నుంచి విభిన్న ప్రకటనల వరకూ.. ఏం జరిగిందంటే?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక.. తన ప్రత్యర్థి దేశం రష్యాతో చెలిమిగానే ఉంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు.;
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక.. తన ప్రత్యర్థి దేశం రష్యాతో చెలిమిగానే ఉంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇక అమెరికాకు చిరకాల మిత్రులైన యూరప్ దేశాలతో కఠువుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ను కూడా రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలని చాలా సార్లు హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ససేమిరా అంటుండడంతో అమెరికాకు పిలిపించి మాట్లాడారు. అక్కడా జెలెన్ స్కీ తీరు చూసి ట్రంప్ చిర్రెత్తిపోయారు. తనతోనే వాగ్వాదం పెట్టుకున్న జెలెన్ స్కీ విషయంలో ఇప్పడు ట్రంప్ ఏం చేస్తాడన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన భేటీ రసాభాసగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, ఖనిజాల తవ్వకం ఒప్పందం, భవిష్యత్ భద్రతా అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ సమావేశం మధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చర్చలు ముగియకుండానే.. ఒప్పందాలు జరగకుండా జెలెన్ స్కీ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ట్రంప్, జెలెన్ స్కీ వాగ్వాదం.. విభిన్న వాదనలతో సమావేశం రసాభాసగా మారింది. అమెరికా డిమాండ్లకు జెలెన్ స్కీ అంగీకరించకుండా వెళ్లిపోవడం.. వాగ్వాదం వీడియోలు వైరల్ అయ్యాయి..
- ఖనిజాల తవ్వకం, శాంతి ఒప్పందంపై చర్చల్లో వాగ్వాదం
ట్రంప్-జెలెన్ స్కీ భేటీ సందర్భంగా అమెరికా ప్రతిపాదించిన అరుదైన ఖనిజాల తవ్వకం, యుద్ధం ముగించి శాంతి ఒప్పందంపై చర్చ జరిగింది. ఉక్రెయిన్‌లోని ఖనిజ వనరులను అమెరికా సంస్థలు ఉపయోగించేందుకు అనుమతించాలని ట్రంప్ సూచించారు. అయితే, భవిష్యత్తులో రష్యా దాడుల విషయంలో భద్రతా హామీ కావాలని జెలెన్‌స్కీ పట్టుపట్టారు. దీనికి ట్రంప్ ప్రతిస్పందన తీవ్రంగా ఉండటంతో భేటీ ఉద్రిక్తంగా మారింది. శాంతి ఒప్పందాన్ని జెలెన్ స్కీ తిరస్కరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
-ట్రంప్ ఏమన్నారంటే?
జెలెన్ స్కీతో వాగ్వాదం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ మధ్య వెంటనే కాల్పుల విరమణ జరగాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. “మేము శాంతికి అనుకూలంగా ఉన్నాము. కానీ జెలెన్‌స్కీ మరొకదాన్ని ఆశిస్తున్నారు. యుద్ధం కొనసాగాలని చూస్తున్నారు" అని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. "జెలెన్‌స్కీ శాంతి కోరుకోవడం లేదు. ఆయన అలాంటి వ్యక్తే కాడు" అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్న జెలెన్ స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ట్రంప్ తో వాగ్వాదం అనంతరం బయటకొచ్చిన ఆయన ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై స్పందించారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఒక ఘటన నేపథ్యంలో ట్రంప్‌కు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అనే విలేకరి ప్రశ్నకు జెలెన్‌స్కీ బదులిస్తూ, "అలాంటిదేమీ లేదు. నేను ఉక్రెయిన్ అధ్యక్షుడిని, అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను. కానీ, నేను ఏ తప్పూ చేయలేదని అనుకుంటున్నాను" అని స్పష్టం చేశారు.ఈ సమస్య ఎంతో క్లిష్టమైనదని, ఇలాంటి పరిస్థితుల్లో స్నేహపూర్వక వైఖరి ఎక్కడుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం కేవలం భద్రతా హామీ మాత్రమేనని వివరించారు. అదే విధంగా, ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సంబంధాల గురించి కూడా జెలెన్‌స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండకూడదని, ఉక్రెయిన్ వైపు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన ఘర్షణ ఇరుపక్షాలకు మేలుకలిగే విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను రష్యాపై తన అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భద్రత, స్వతంత్రత ముఖ్యమని, అగ్రరాజ్యాల మద్దతు అత్యవసరమని వ్యాఖ్యానించారు.
-ట్రంప్ -జెలెన్ స్కీ వాగ్వాదంతో తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన భేటీ తొలుత సజావుగా ప్రారంభమైనా కొంతసేపటికే తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ వైఖరి మూడో ప్రపంచయుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో జెలెన్‌స్కీ కూడా స్పందించగా, సమావేశ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘట్టం ఇరు దేశాల రాయబారుల సమక్షంలో చోటుచేసుకుంది. ట్రంప్ మాటలు, జెలెన్‌స్కీ ప్రతిస్పందన చూసిన అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఇది ఎలా జరుగుతోంది?’ అన్నట్లుగా ఆమె తల పట్టుకున్న క్షణాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
- ఉక్రెయిన్ భవిష్యత్తుపై అనుమానాలు
ఈ భేటీతో ఉక్రెయిన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. ట్రంప్, పుతిన్ యుద్ధం ముగించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించగా, జెలెన్‌స్కీ మాత్రం రష్యా ముప్పును గంభీరంగా తీసుకుంటున్నారు. తాను అమెరికా మద్దతును కొనసాగించాలని కోరుకుంటున్నప్పటికీ, ట్రంప్ వైఖరి విభిన్నంగా ఉందని శాంతి చర్చలు చేసేది లేదన్నారు. దీంతో ఉక్రెయిన్ భవిష్యత్తు అమెరికా వైదొలిగితే ప్రమాదంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను చాటిచెప్పింది. ఖనిజాల ఒప్పందం, భద్రతా హామీ, శాంతి చర్చలు.. అన్ని అంశాల్లోనూ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఎలా ముందుకెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.