శ్రీవారి హుండీకే కన్నం పెట్టిన ఉద్యోగి

థర్డ్ పార్టీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పెంచలయ్య పనిచేస్తున్నాడు. పరకామణి వద్దకు ట్రాలీ ద్వారా హుండీలను తీసుకువెళ్లడం నిందితుడి విధి.

Update: 2025-01-12 12:22 GMT

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది సామెత. కానీ, తిరుమల శ్రీవారి ఆలయ విజిలెన్స్ ఇంటి దొంగను పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. శ్రీవారి హుండీలోని 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను దొంగిలించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యను చాకచక్యంగా పట్టుకుని బంగారాన్ని రికవరీ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం హుండీ దొంగతనం కలకలం రేపింది. ఆగ్రిగోస్ అనే సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాలీ డ్రైవరుగా పనిచేస్తున్న పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను దొంగిలించి అడ్డంగా బుక్కయ్యాడు. శనివారం రాత్రి బంగారు బిస్కెట్ ను దొంగిలించిన పెంచలయ్య ట్రాలీ పైపులో బిస్కెట్ ను దాచాడు. విజిలెన్స్ తనిఖీల్లో పైపులో బంగారు బిస్కెట్ ఉందని పసిగట్టి వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం తిరుపతి పోలీసులకు అప్పగించడంతో నిందితుడిని అరెస్టు చేసి దొంగతనం కేసు నమోదు చేశారు.

థర్డ్ పార్టీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పెంచలయ్య పనిచేస్తున్నాడు. పరకామణి వద్దకు ట్రాలీ ద్వారా హుండీలను తీసుకువెళ్లడం నిందితుడి విధి. శనివారం కూడా పరకామణి విధుల్లో ఉన్న నిందితుడు హుండీలను తీసుకువెళుతుండగా, విజిలెన్స్ తనిఖీ చేసింది. ట్రాలీ పైపులో బంగారు బిస్కెట్ ఉన్నట్లు గుర్తించింది. ఈ సంఘటనతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఒక్కటే ఈ నేరానికి పాల్పడ్డాడా? అతడికి ఎవరైనా సహకరించారా? అని పోలీసులు విచారిస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి దొంగతనాలు ఏమైనా చేశాడా? అని ఆరా తీస్తున్నారు.

పరకామణి చుట్టుపక్కల చాలా నిఘా ఉంటుంది. సీసీ కెమెరాలతోపాటు విజిలెన్స్ అధికారులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటారు. అలాంటి చోట ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఒక్కడే ఇంతటి పని చేయగలడని ఎవరూ నమ్మడం లేదు. అతడికి సహకరించిన వారిని పట్టుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News