మీరు పోయారు.. మాకు ఎస‌రెందుకు: భూమ‌న‌కు సెగ‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, తిరుమ‌ల తిరుప‌తి బోర్డు మాజీ చైర్మ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ప‌ట్ల తిరుప‌తి, తిరుమ ల‌లో ప‌నిచేసే ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.;

Update: 2025-04-15 06:56 GMT
మీరు పోయారు.. మాకు ఎస‌రెందుకు: భూమ‌న‌కు సెగ‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, తిరుమ‌ల తిరుప‌తి బోర్డు మాజీ చైర్మ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ప‌ట్ల తిరుప‌తి, తిరుమ ల‌లో ప‌నిచేసే ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ''మీరు పోయారు.. మాకెందుకు ఎస‌రు పెడుతున్నారు? '' అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. రోడ్డెక్కారు. అంతేకాదు.. మీలా మేం.. సంపాయించుకోలేద‌ని.. నెల జీతాల‌తో బ‌తుకులు, కుటుంబాల‌ను వెళ్ల‌దీస్తున్నామ‌ని.. అలాంటి త‌మ పొట్ట కొట్టొద్ద‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల‌లోకి త‌మ‌ను లాగొద్ద‌ని కూడా .. వేడుకుంటున్నారు.

ఏం జ‌రిగింది..

గ‌త నాలుగు రోజులుగా.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి అనుబంధంగా ఉన్న తిరుప‌తిలోని గోశాల వ్య‌వ హారం.. వివాదంగా మారింది. గ‌త మూడు మాసాల్లో ఇక్క‌డ వంద గోవులు మృతి చెందాయ‌ని మాజీ చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు భూమన విమ‌ర్శ‌లు గుప్పించి.. వివాదానికి తెర‌దీశారు. అయితే.. దీనిపై స్పందించిన ప్ర‌స్తుతం బోర్డు చైర్మ‌న్ నాయుడు.. ఆధారాలు ఉంటే చూపించాల‌ని స‌వాల్ రువ్వారు. ఇక‌, టీటీడీ ఈవో కూడా.. ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌ద్ద‌ని సూచించారు.

దీనికి కౌంట‌ర్‌గా భూమ‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. నోరు జారారు. తిరుమ‌ల‌లో ఏం జ‌రుగుతోందో.. అంతా త‌మ‌కు తెలుసున‌ని.. అన్నారు. అంతేకాదు.. సుమారు 2 వేల మంది ఉద్యోగులు అన్ని విష‌యాలు త‌మ‌కు చేర వేస్తున్నార‌ని బాంబు పేల్చారు. ``టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది మావారే`` అని భూమన అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆ ఉద్యోగుల కొంప ముంచే అవ‌కాశాన్ని క‌ల్పించాయి. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ‌గా ఉన్నారు. వీరికి ఉద్యోగ భ‌ద్ర‌త‌లేదు. ర‌మ్మంటే రావాలి.. పొమ్మంటే పోవాలి. ఇలాంటి స‌మ‌యంలో వారంతా వైసీపీ వారేన‌ని భూమ‌న బాంబు పేల్చ‌డంతో వారి భ‌విత‌వ్యం ఇర‌కాటంలో ప‌డింది. ఏ వ్య‌వ‌స్థ అయినా.. సంస్థ అయినా.. ప్ర‌త్య‌ర్థుల‌కు స‌మాచారం అందించే ఉద్యోగుల‌ను భ‌రించ‌దు. సో.. ఈ నేప‌థ్యంలో టీటీడీ వారిని ప‌క్క‌న పెట్టే అవకాశం ఉంది. దీంతో స‌ద‌రు ఉద్యోగులు ముందుగానే గుర్తించి.. భూమ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు.

Tags:    

Similar News