లడ్డూ సెగలు.. టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు!
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు కలిపారంటూ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు కలిపారంటూ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలోకి కేంద్ర మంత్రులు కూడా ప్రవేశించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు వివిధ పార్టీల నేతలు కూడా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూపై కొంతకాలంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాణ్యత లేదని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వారు సైతం నాణ్యత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. లడ్డూ రుచిగా, నాణ్యతతో ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని పోటు సిబ్బంది తనకు సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెయ్యి నాసిరకంగా ఉందని దాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ కు చెప్పామన్నారు.
‘‘నెయ్యిలో నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించాను. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీటీకి సొంత ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. మేం హెచ్చరించిన తర్వాత కాంట్రాక్టుర్లు నాణ్యత పెంచారు’’ అని ఈవో శ్యామలరావు తెలిపారు.
‘‘స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా చేయాలంటే దానికి వేరియబుల్ రేట్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ఉచితంగా దాన్ని సప్లై చేయరు. వారికి కూడా ఇది వ్యాపారం కాబట్టి ఫ్రీగా ఇవ్వరు. రకాన్ని బట్టి కిలో రూ.320 నుంచి రూ. 411 వరకు రేట్లు ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారనేది చూస్తే.. ఆ రేట్లు పరిశీలిస్తే.. ఆ రేట్లకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేయడం వీలు కాదంటున్నారు. ఈ విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు’’ ఈవో శ్యామలరావు తెలిపారు.
‘‘అలాగే సా«ధారణ ప్రజలు కూడా చెబుతున్నారు. మనం బయట నెయ్యి కొంటే ఎంతకు వస్తుందనేది మనకు కూడా తెలుసు. క్వాలిటీ నెయ్యి కావాలంటే ఎంత రేటు పెట్టాలో మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకు కొనడం వల్ల.. మొదటే మనకు దెబ్బ. తక్కువ రేటు పెడితే క్వాలిటీపై దాదాపు కంట్రోల్ ఉండదు. మనకు సొంతంగా ల్యాబ్స్ లేవు. బయట ల్యాబ్‌లపై ఆధారపడాల్సిందే. రేట్లు కూడా తక్కువ. ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ నెయ్యి రాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇందుకు కారణాలేంటో విశ్లేషించాం. ఎనాలిసిస్ ఎందుకు చేశామంటే.. ఏం జరిగింది? ఎలా చేయాలి?.. కరెక్ట్ స్టెప్స్ తీసుకోవడానికి ఎనాలిసిస్ చేశాం. ఏఆర్ డెయిర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తప్ప మిగతా సప్లయిర్స్ అంతా బాగానే ఉన్నారు’’ అని శ్యామలరావు వెల్లడించారు.
‘‘నాలుగు ట్యాంకర్లలో నెయ్యిని జులై 6న 10 ప్రయోగశాలలకు పంపాం. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్ కు పంపించాం. ఎన్‌డీడీబీ చాలా పేరున్న ల్యాబ్. ఇది గుజరాత్‌లోని ఆనంద్ లో ఉంది. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్టు నివేదికలు వచ్చాయి. వారం రోజుల్లోనే రెండు విభాగాలుగా ల్యాబ్ నివేదికలను ఇచ్చింది. ఇందులో నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉంది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్టు ఎన్‌డీడీబీ తేల్చింది’’ శ్యామలరావు బాంబు పేల్చారు.
‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలోనే కల్తీ జరిగింది. నెయ్యి కల్తీ అయ్యిందని తేలిన వెంటనే చర్యలకు దిగాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీని కూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నెయ్యి కల్తీ పరీక్ష కోసం బయటకు పంపడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి’’ అని ఈవో శ్యామలరావు తెలిపారు.