తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటుతో తెలుగురాష్ట్రాలకు నష్టం ఎంత?

తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటు కారణంగా తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టాల్ని చూస్తే..

Update: 2024-08-12 04:39 GMT

శనివారం రాత్రి వేళ.. అనూహ్యంగా కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు ఉదంతంలో కర్ణాటకకు జరిగే నష్టం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు సైతం నష్టపోతున్నాయి. తుంగభద్ర డ్యాం నిర్వాహణ.. గేటు వ్యవహారం మొత్తం కర్ణాటకకే సంబంధించిన అంశమైనప్పటికీ.. ఇప్పుడు చోటు చేసుకున్న ఉదంతంతో భారీగా నష్టం వాటిల్లుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. కారణం.. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో తుంగభద్ర డ్యాంలోని 65 టీఎంసీల నీటిని విడుదల చేస్తుండగా.. వాటిని సముద్రం పాలు చేయటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి.

మరోవైపు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాలనని వరద ముప్పు పొంచి ఉంది. గేటు కొట్టుకుపోయిన ఉదంతంలో అక్కడ స్టాప్ లాక్ లేకపోవటంతోనే ప్రమాదం జరిగిందన్న విషయాన్ని గుర్తించారు. వరద తీవ్రత పెరిగిన వేళలో.. 19వ గేటు ఎత్తుతున్న వేళలో చైన్ లింక్ తెగిపోవటం.. గేటు కొట్టుకుపోవటంతో దిగువకు నీరు పోటెత్తుతోంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటును ఏర్పాటు చేయాలన్నా.. ప్రాజెక్టులో 40 టీఎంసీలకు దిగువన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విలువైన 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా సముద్రం పాలు కానున్నది. కర్ణాటక నుంచి కర్నూలు సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇచ్చే తుంగభద్ర జలాలు.. తెలంగాణ మీదుగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. చివరకు విజయవాడకు చేరుకొని.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలవనున్నాయి.

తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటు కారణంగా తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టాల్ని చూస్తే..

- ఉమ్మడి అనంతపురం.. కర్నూలు జిల్లాలకు తుంగభద్ర గుండెకాయ. ఈ డ్యాంను నమ్ముకొని రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన లక్షలాది మంది రైతులు పలు రకాల పంటల్ని వేస్తుంటారు.

- ఉమ్మడి కర్నూలు.. అనంత.. కడప జిల్లాలు ఏపీలోనూ.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలకు సాగు.. తాగు నీరు అందిస్తుంటుంది తుంగభద్ర జలాశయం.

- జలశాయ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలు. పూడిక చేరటంతో 105.7 టీఎంసీలకు కుదించారు.

- కృష్ణా జలాల ట్రైబ్యునల్‌ బచావత్ అవార్డు-1 ప్రకారం.. కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ వాటాగా 24 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 10 టీఎంసీలు.

- అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ కాలువ వాటాగా 35.5 టీఎంసీలు.

- తెలంగాణ ఆర్డీఎస్‌ కాలువకు 8.5 టీఎంసీలు.

- మొత్తంగా తెలుగు రాష్ట్రాల వాటా 78 టీఎంసీలు. కర్ణాటక వాటాగా 134 టీఎంసీలు.

- డ్యాంలో చేరే వరద అంచనాకు తగ్గట్లుగా.. దామాషా లెక్కకు తగ్గట్లు కేటాయింపులు జరుపుతారు.

- ఎల్లెల్సీ.. హెచ్చెల్సీ.. కేసీ కాలువ ద్వారా కర్నూలు.. అనంత.. కడప జిల్లాల్లో దాదాపు 6.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

- తాజాగా పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలో కలవటంతో ఆ మేరకు నష్టం వాటిల్లుతుందని.. కేటాయింపులు తగ్గుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది

Tags:    

Similar News