జర్నలిజం రంగంలో ఓ "సూర్య" కిరణం అస్తమించింది. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి, సహృదయుడు, దయ కలిగిన మనిషి, చిత్రాలకు అక్షర రూపం ఇస్తూ.. సినిమాలకు సంబంధించిన వార్తలు, సమీక్షలతో చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక శైలిని అలవర్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ మృతి చెందారు.
అవును... తుపాకీ.కామ్ వెబ్ సైట్ లో జర్నలిస్టుగా సేవలందిస్తూ.. తనదైన శైలిలో సినిమా వార్తలు, సమీక్షలు, మొదలైన అంశాలను తనదైన శైలిలో అందిస్తూ ముందుకు సాగుతున్న కే సూర్య (26) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్య చివరకు పరిస్థితి విషమించి కన్నుమూశారు. సుమారు ఐదు సంవత్సరాలపాటు తుపాకీ.కామ్ లో తన సేవలు అందించిన ఆయన.. "ఇక సెలవు" అంటూ వెళ్లిపోయారు.
అందమైన పదాలు, ధృఢమైన అభిప్రాయంతో సినీ సమీక్షలు చేస్తూ.. మరింత అందమైన పదప్రయోగాలు, సుందరమైన వ్యాఖ్య నిర్మాణాలతో ఆకర్షణీయ కథనాలు అందించే సూర్య కలం పాళి నిలిచిపోయింది. ఆయన అకాల నిష్క్రమణ తీరని లోటుగా మిగిలిపోయింది.
ఈ సందర్భంగా ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి ఆయన తండ్రి సుధాకర్ రావు గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ తీవ్రమైన దుఃఖాన్ని తట్టుకునే శక్తిని వారికి ప్రసాదించాలని.. సూర్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది ‘తుపాకీ.కామ్’ యాజమాన్యం, సహచర గణం!