అక్టోబర్ నెలలోనే 166 ఉరిశిక్షలు... ఇతడికి మాత్రం రెండుసార్లు!
అయితే... మర్డర్ కేసులో దోషిగా తేలిన ఓ యువకుడికి మాత్రం రెండుసార్లు ఉరిశిక్ష అమలు చేశారు.
ఒక వ్యక్తికి ఒక్కసారి ఉరిశిక్ష వేస్తారనే సంగతి తెలిసిందే! అయితే... మర్డర్ కేసులో దోషిగా తేలిన ఓ యువకుడికి మాత్రం రెండుసార్లు ఉరిశిక్ష అమలు చేశారు. ఇందులో మొదటిసారి ఉరిశిక్ష అమలుకోసం.. సదరు యువకుడిని ఉరికంబంపై వేలాడదీసిన అనంతరం ఆ శిక్ష నిలిపివేయడం గమనార్హం. అయితే... రెండోసారి తప్పలేదు!
అవును... ఓ మర్డర్ కేసులో దోషిగా తేలిన యువకుడికి కొన్ని నెలల క్రితం ఉరిశిక్ష అమలుచేశారు. అయితే... సరిగ్గా ఉరికంబంపై వేలాడదీసిన కొద్దిసేపటికే హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు "క్షమాపణ"కు అంగీకరించారు. దీంతో.. అతడు క్షణాల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే... దోషిని విధి వంచించింది! కాలం గేలం వేసింది! ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయితే క్షమాపణకు అంగీకరించారో.. వారితో పరిహారం విషయంలో అగ్రిమెంట్ సెట్ కాలేదు. దీంతో... అతడికి మరోసారి ఉరిశిక్ష అమలుచేశారు. అయితే.. ఈసారి మాత్రం ఏ విషయము అతడిని కాపాడలేకపోయింది.
వివరాళ్లోకి వెళ్తే... ఇరాన్ కు చెందిన అహ్మద్ అలీజెదా (26) అనే యువకుడు ఓ మర్డర్ కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో అతడికి ఉరిశిక్ష పడింది. దీంతో.. అతడికి ఏప్రిల్ 27న హెజెల్ హెసర్ జైల్లో ఉరిశిక్ష అమలు కార్యక్రమం మొదలుపెట్టారు. ఉరికంబం ఎక్కిన 28 సెకన్లకు "ఆగండి.." అనే స్థాయిలో ట్విస్ట్ నెలకొంది!
ఇందులో భాగంగా... బాధిత తరుపు కుటుంబీకులు "క్షమాభిక్ష" అంటూ గట్టిగా అరిచారు. దీంతో... శిక్షను సడన్ గా నిలిపేసి, అతడిని ఉరికంబం నుంచి కిందకు దించారు. అప్పటికే నిర్జీవంగా కనిపించినప్పటికీ.. ఫైనల్ గా బ్రతికి బయటపడ్డాడు. అయితే... బాధిత కుటుంబంతో ఒప్పందం మాత్రం కుదరలేదు.
దీంతో తాజాగా రెండోసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఈసారి తప్పలేదు. ఈ విషయాన్ని ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐ.హెచ్.ఆర్.) తెలిపింది. ఇదే సమయంలో ఇటీవల ఇరాన్ లో ఉరిశిక్షలు భారీగా పెరిగాయని.. ఇందులో భాగంగా.. ఒక్క అక్టోబర్ లోనే 166 మందికి ఉరిశిక్ష అమలు చేశారని వెల్లడించింది.