సీఎం రేవంత్ ప్రారంభించిన మరో రెండు గ్యారెంటీ పథకాలు ఇవే!
పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుకు రేవంత్ శ్రీకారం చుట్టారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుకు రేవంత్ శ్రీకారం చుట్టారు. ఈ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు వెల్లడించారు,
కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి.. రూ.1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దశలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,200కి పెంచిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తమ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.
సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారని రేవంత్ తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమేనని వెల్లడించారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారని చెప్పారు.
పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారని రేవంత్ వెల్లడించారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. హామీలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.
తండ్రీ కొడుకులు (కేసీఆర్, కేటీఆర్), మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్ రావు) తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమన్నారు. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని తేల్చిచెప్పారు.