పిఠాపురం- సత్తెనపల్లి... సేమ్ టు సేమ్.. రీజనేంటి?
కాపులు వర్సెస్ కాపుల మధ్య జరుగుతున్న పోరులో అందరి దృష్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంపైనే ఉంది.
కాపులు వర్సెస్ కాపుల మధ్య జరుగుతున్న పోరులో అందరి దృష్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంపైనే ఉంది. అయితే.. ఇక్కడ మరో ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండడంతో ఈ వ్యవహారం మరింత సెన్సేషన్ అయింది. ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు. ఆమె కూడా కాపు కులస్తురాలే కావడం తెలిసిందే. అయితే.. ఈ నియోజకవర్గంలో సమానంగా.. ఇంకా చెప్పాలంటే ఒకింత ఎక్కువగానే హీటెక్కించిన మరో నియోజకవర్గం సత్తెన పల్లి! పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలోనూ కాపులు వర్సెస్ కాపుల మధ్యే పోరు సాగుతోంది.
కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ నాయకుడు.. కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు.. ఇద్దరూ కూడా కాపు నాయకులే. కాపుల్లో పట్టున్న నాయకులే కావడం గమనార్హం. అయితే.. వీరిపై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ.. వాస్తవానికి ఎన్నికల రోజు ఘర్షణలు జరిగిన నియోజకవర్గంలో ఇది కూడా ఉంది. అంతేకాదు.. కన్నా వర్సెస్ అంబటి మధ్య పోరు.. నిజానికి పవన్ వర్సెస్ గీత మధ్య కన్నా ఎక్కువగా జరిగింది. ఈ విషయంలో రెండు సారూప్యతలు మనకు కనిపిస్తాయి. పవన్‌కు మద్దతుగా.. పిఠాపురంలో ప్రచారం చేస్తానంటూ.. ముద్రగడ పద్మనాభం కుమార్తె తెరమీదికి వచ్చారు.
అలానే.. ఆమె పవన్ పాల్గొన్న సభలకు కూడా వచ్చారు. రెండు మూడు వీడియోలు చేసి పవన్‌ను బలపరిచే ప్రయత్నం చేశారు. ఇక, సత్తెనపల్లి విషయానికి వస్తే.. ఇక్కడ మంత్రి అంబటి సొంత అల్లుడు(విడాకుల ప్రయత్నంలో ఉన్నారు) డాక్టర్ గౌతం సడెన్‌గా తెరమీదికి వచ్చారు. తన మామ అంబటి దుర్మార్గుడంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నాయకుడికి ఓటేయొద్దని చెప్పారు. ఈయన కూడా వరుస వీడియోలు చేసి.. తీవ్రస్థాయిలో హీటెక్కించారు. అంటే.. అక్కడ ముద్రగడ కూతురు, ఇక్కడ అంబటి అల్లుడు.. ఇద్దరూ.. కూడా సీన్ రివర్స్ చేసేశారు.
ఇక, పిఠాపురంపై అనేక మంది పందెం రాయుళ్లు పందేలు కట్టారని వార్తలు వచ్చాయి. కానీ, పల్నాడులో పిఠాపురం కంటే కూడా.. ఎక్కువగా పందేలు కట్టిన విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ 150 కోట్ల వరకు పందేలు కట్టినట్టు వైసీపీ నాయకులే చెబుతున్నారు. కన్నాకు అనుకూలంగా మెజారిటీ వర్గాలు పందేలు కట్టాయని.. చెబుతున్నారు. ఇక, పిఠాపురంలో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం చేయగా.. సత్తెనపల్లిలోనూ.. ప్రధాన పార్టీల నాయకులు చంద్రబాబు, జగన్‌లు ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే..కాపుల ఓటు బ్యాంకు కీలకమైన సత్తెనపల్లిలో విజయం దక్కించుకునేందుకు వీరు వ్యూహాత్మకంగా ఆ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయడం గమనార్హం. చివరగా.. ఉమ్మడి గుంటూరులో రెండే రెండు నియోజకవర్గాల గురించి హాట్ టాప్ జరుగుతోంది. ఒకటి నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి, రెండు సంబరాల రాంబాబు పోటీలో ఉన్న సత్తెనపల్లి!!