కుమారుడికి ప్రమోషన్‌ పై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వారస్వత పార్టీలే ఎక్కువ. ముఖ్యంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆయా నేతల వారసులే నడిపిస్తున్నారు

Update: 2024-10-01 09:23 GMT

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వారస్వత పార్టీలే ఎక్కువ. ముఖ్యంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆయా నేతల వారసులే నడిపిస్తున్నారు. మరికొన్ని పార్టీల్లో తండ్రుల చాటున వారసుల కీలక పాత్ర పోషిస్తున్నారు.

తమిళనాడులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఫక్తు వారసత్వ పార్టీగా ముద్రపడ్డ డీఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ ఉన్నారు. స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ఇప్పటివరకు యువజన, క్రీడల సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ కు ఆయన తండ్రి ప్రమోషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న తన కుమారుడు ఉదయనిధిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేశారు. ఈ మేరకు గవర్నర్‌ రవి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం ఉన్న యువజన, సర్వీసుల శాఖకు తోడు ప్రణాళిక, అభివృద్ధి శాఖను కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని స్పష్టం చేశారు.

క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని ఆయన తండ్రి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని అభినందనల జల్లు కురిపించారు.

డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్‌ ఆకాంక్షించారు. కాగా డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడా శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాఖకు అదనంగా ప్రణాళిక, అభివృద్ధి శాఖలను కూడా నిర్వహించనున్నారు.

కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో ఉదయనిధి చిక్కుకుంటున్నారు. గతంలో సనాతన ధర్మాన్ని చికెన్‌ గున్యా, డెంగీతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రేగాయి. అయినప్పటికీ క్షమాపణలు చెప్పబోనని ఉదయనిధి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News