చోళులు ఉన్నారు 'రాములు' ఏరీ ఎక్కడ? తమిళ మంత్రి అతి వ్యాఖ్యలు
అప్పట్లో పదపదే విమర్శలతో ఉదయనిధి అన్ పాపులర్ అయ్యారు.
మనలో కొందరికి భక్తి ప్రపత్తులు అధికంగా ఉండొచ్చు.. మరికొందరికి దేవుడంటే నమ్మకం ఉండొచ్చు.. ఇంకొందరికి అసలు భక్తి, దేవుడు అనే పేరు కూడా ఇష్టం లేకపోవచ్చు.. చాలామందికి విగ్రహారాధన తగదని అనిపించవచ్చు.. కానీ, భారత దేశం అంటే సనాతన ధర్మానికి పేరొందింది. లౌకిక రాజ్యంలో అన్ని మతాలను సమంగా చూసే పవిత్ర భూమి ఇది. అయితే, కొందరు పేరు కోసమో.. వివాదాలతో ఫేమస్ కావాలనో సంచలన వ్యాఖ్యలు చేయడం గతంలో చూశాం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. ఎవరి అభిప్రాయం వారిది. ఎవరి నమ్మకం వారిది అని.. వాటిని మౌనంగా భరిస్తూనో, ఇష్టం లేకపోతే పక్కకు తప్పుకోవడమే చేయాలి. ఇలాకాకుండా నేరుగా విమర్శలకు దిగితేనే రచ్చ జరుగుతుంది.
అప్పట్లో సీఎం కుమారుడు.. ఇప్పడు మంత్రి
దాదాపు రెండేళ్ల కిందట తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి కూడా అయిన ఉదయనిధి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. చెడ్డపేరు మూటగట్టుకున్నారు. అప్పట్లో పదపదే విమర్శలతో ఉదయనిధి అన్ పాపులర్ అయ్యారు. మెజారిటీ ప్రజలు ఆచరించే మతాన్ని నువ్వు గౌరవించకున్నా ఫర్లేదు.. బహిరంగంగా విమర్శించడమే తప్పు. ఉదయనిధి అదే చేశారు. కాగా, తాజాగా తమిళనాడు మంత్రి ఎస్ఎస్ శివశంకర్ ఆయన బాటలోనే నడిచారు.
రాముడు ఎక్కడ..?
భారతీయులు పురాణ పురుషుడిగా, సద్గుణాలు మూర్తీభవించిన మనిషిగా కొలిచేవాడు శ్రీరాముడు. భద్రాచలం నుంచి అయోధ్య వరకు రాముడంటే ఆదర్శ పురుషుడే. అయితే, రాముడు అనేవాడు లేనే లేడని, ఉంటే చారిత్రక ఆధారాలు చూపాలని వ్యాఖ్యానించారు ఎస్ఎస్ శివశంకర్. తమిళనాడు సహా పలు ప్రాంతాలను పాలించిన చోళ రాజు రాజేంద్ర చోళుడి గురించి పుస్తకాలు ఉన్నాయని.. మరి రాముడు ఉన్నాడంటూ పుస్తకాలు ఏవని ప్రశ్నించారు. కొలనులు, ఆలయాలు నిర్మించిన రాజేంద్ర చోళుడి గురించి శివశంకర్ చెప్పుకొచ్చారు. అయితే, రాముడు మాత్రం కేవలం కల్పితం అని.. చరిత్రను వక్రీకరించేందుకు ఆ పాత్రను ప్రవేశపెట్టారని ఆరోపించారు. కాగా, శివశంకర్ వ్యాఖ్యలు సహజంగానే తమిళనాడులో సంచలనం రేపాయి. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే నేతల తీరును ఎండగట్టారు. చోళ రాజు రాజేంద్ర చోళుడి సెంగోల్ విషయంలోనూ ఆ పార్టీ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. రాముడి మీద డీఎంకే అకారణ, అనూహ్య దాడి వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు.