ముఖ్యమంత్రి కుమారుడి వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం!

మరోవైపు ఈ స్థాయిలో తనపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్‌ చెబుతున్నారు

Update: 2023-09-04 05:17 GMT

సనాతన ధర్మం కూడా డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని మనం వ్యతిరేకించకూడదని.. పూర్తిగా నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు క్రీడలు, యువత శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అనేక మంది నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్టాలిన్‌ కు చెందిన డీఎంకే పార్టీ.. ఇండియా కూటమిలో ఉండటంతో దాన్ని లక్ష్యంగా చేసుకుని అమిత్‌ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి సనాతన ధర్మానికి వ్యతిరేకమని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హిందూ సంఘాలు, వివిధ పార్టీల నేతలు కూడా ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ స్థాయిలో తనపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్‌ చెబుతున్నారు. తనపైన కేసులు వేసుకున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని అంటున్నారు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్‌ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకుంటుండటం గమనార్హం.

ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల ప్రభావం వచ్చే లోక్‌ సభ ఎన్నికలపై పడే ప్రభావం ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగతమని స్పష్టం చేసింది. తమ పార్టీకి ఆయన వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

ఇంకోవైపు బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ.. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని ఆయన అంటున్నారని ధ్వజమెత్తారు.

సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారని అమిత్‌ మాలవీయ తెలిపారు. వారిని సామూహికంగా హత్య చేయాలని ఉదయనిధి అభిప్రాయపడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే ముఖ్యమైన పార్టీగా ఉందన్నారు. కాంగ్రెస్‌ తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉందని గుర్తు చేశారు. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా? అని అమిత్‌ మాలవీయ నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అమిత్‌ మాలవీయ ట్వీట్‌ ను ఉదయనిధి కోట్‌ చేస్తూ.. తాను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారిని నరమేధం చేయాలని చెప్పడం లేదన్నారు. సనాతన ధర్మం అనేది కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రమని మరోమారు ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ద్వారా మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టాలని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

Tags:    

Similar News