మోడీ కామెంట్లు తప్పు కాదా?: స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని, దానిని నిషేధించడం కన్నా నిర్మూలించడం సులువని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ కాక రేపాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీతోపాటు పలు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ మతాన్ని ఇండియా కూటమి ద్వేషిస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని షా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్లపై ఉదయనిది స్టాలిన్ తాజాగా స్పందించారు. బిజెపి తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, నకిలీ వార్తలను ప్రచారం చేస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. ఇది వారికి అలవాటైన పనేనని, తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఫేస్ చేసేందుకు రెడీ అని అన్నారు. ఇండియా కూటమి చేతిలో బిజెపికి ఓటమి తప్పదని, ఆ భయంతోనే ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు.
ద్రవిడ మోడల్ మార్పు కోసం డీఎంకే పిలుపునిచ్చిందని, అందర్నీ సమానంగా చూస్తుందని స్టాలిన్ చెప్పారు. తాను మారణ హోమానికి పిలుపునిచ్చినట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ద్రవిడ వాదాన్ని తొలగించాలని ఇంకొందరు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దాని అర్థం డీఎంకే వాళ్లను చంపాలనా అని ప్రశ్నించారు. అలా అయితే గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చంపేశారా అని ప్రశ్నించారు. సనాతన అంటే ఏదీ మారకూడదని, శాశ్వతంగా ఉండాలని అర్థం అని వివరించారు.