మళ్లీ ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు!

ఉదయనిధి స్టాలిన్‌ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని అయోధ్యకు చెందిన స్వామీజీ ఒకరు కలకలం రేపారు

Update: 2023-10-16 07:57 GMT

సనాతన ధర్మం... డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అనేక మంది నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఉదయనిధి స్టాలిన్‌ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని అయోధ్యకు చెందిన స్వామీజీ ఒకరు కలకలం రేపారు. అలాగే ఆయనను చెప్పుతో కొడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఏపీ జనజాగరణ సమితి ప్రకటించింది. ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు దాఖలయ్యాయి.

మరోవైపు ఈ స్థాయిలో తనపై ఆగ్రహం వ్యక్తమైనా ఉదయనిధి స్టాలిన్‌ వెనక్కి తగ్గలేదు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్‌ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకున్నారు.

కాగా ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండగా మరోమారు ఉదయనిధి తేనెతుట్టెను కదిపారు. ఈసారి ఆయన కొద్ది రోజుల క్రితం జరిగిన భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ ను లక్ష్యంగా చేసుకున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ లో భాగంగా అహ్మదాబాద్‌ లో జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టేడియంలో ప్రేక్షకులు జనగణమన, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. అలాగే మరికొందరు జై శ్రీరామ్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యంగా పాక్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ డ్రెస్సింగ్‌ రూంకు వస్తున్న సమయంలో అభిమానులు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలపై ఉదయనిధి స్టాలిన్‌ స్పందించారు. భారత్‌–పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా భారత అభిమానులు జై శ్రీరామ్‌ నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తప్పుబట్టారు. పాకిస్థాన్‌ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడలు దేశాన్ని ఐకమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని ఉదయనిధి స్పష్టం చేశారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో భారత అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. కొందరు అభిమానుల చర్యలను సమర్థించగా మరికొందరు ఇలాంటివి చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. మనదేశానికి వచ్చిన అతిథులు వారని.. వారు బాధపడేలా వ్యవహరించడం సరికాదన్నారు.

తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. ఇప్పటికే సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దేశమంతా ఆయన నిరసన ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాక్‌ కు మద్దతుగా మాట్లాడటంపై ఆయనపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతాయో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News