యూకే ఎన్నికల్లో తెలుగోళ్ల ఓటమి
ముందస్తు ఎన్నికల అంచనాలతో పాటు.. పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ కు తగ్గట్లే యూకే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి
ముందస్తు ఎన్నికల అంచనాలతో పాటు.. పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ కు తగ్గట్లే యూకే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోగా.. విపక్ష లేబర్ పార్టీ సుదీర్ఘ విరామం తర్వాత అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో అధికార.. విపక్ష పార్టీ అభ్యర్థులుగా పలువురు భారతీయులు బరిలో నిలిచారు. వీరిలో ఇద్దరు తెలుగు సంతతికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. వారిద్దరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.
అంతర్జాతీయ వ్యక్తగా.. రచయితగా పేరున్న ఉదయ్ నాగరాజు ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి పోటీ చేశారు. లేబర్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందినప్పటికీ.. ఉదయ్ నాగరాజు పోటీచేసిన స్థానంలో మాత్రం అధికార కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి రిచర్డ్ పుల్లర్ 19,981 ఓట్లతో విజయం సాధించారు. నాగరాజు రెండో స్థానానికి పరిమితమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన వారు. యూకేలోని ప్రఖ్యాత వర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో ఆయన పీజీ చేశారు. దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన బంధువుగా సుపరిచితులు. ఇక.. తెలుగు సంతతికి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి. ఆయన అధికార కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు.
తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానంలో లేబర్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన ఆయన.. చదువు పూర్తి అయ్యాక లండన్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీలో రెండుసార్లు కౌన్సిలర్ గా.. ఒకసారి మేయర్ గా పని చేసిన ఆయన తాజా ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు.