ఇదిగో ట్రంప్.. ఉచితంగా నీ డబ్బు వద్దు : జెలెనస్కీ సంచలనం
ఇక యూఎస్ నుంచి వంద బిలియన్ డాలర్లు, యూరప్ నుంచి మరో వంద డాలర్ల సాయం అందిందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనస్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న తమకు అమెరికా రూ.43 లక్షల కోట్లు (500 బిలియన్ డాలర్లు) సాయం చేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమకు అమెరికా నుంచి కేవలం రూ.8.67 లక్షల కోట్లు (వంద బిలియన్ డాలర్లు) స్పష్టం చేశారు. మూడేళ్ల యుద్ధంలో మొత్తం 320 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యిందని, ఇందులో 120 బిలియన్ డాలర్లను తమ దేశ పౌరులే సమకూర్చుకున్నట్లు జెలనస్కీ వివరించారు. ఇక యూఎస్ నుంచి వంద బిలియన్ డాలర్లు, యూరప్ నుంచి మరో వంద డాలర్ల సాయం అందిందని తెలిపారు.
అమెరికా చేసిన సాయానికి ప్రతిగా తమ దేశంలోని ఖనిజ సంపదను ఇస్తామని ప్రతిపాదించారు. అయితే ఉక్రెయిన్ పౌరులు పది తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు తాను సిద్ధంగా లేనని జెలెనస్కీ ప్రకటించారు. రక్షణ సాయం అందిస్తున్నందుకు ప్రతిగా సహజ వనరులను అందించేందుకు ట్రంప్ తో చర్చిస్తానని జెలెనస్కీ చెప్పారు. అయితే అమెరికాతో జరిగే ఏ ఒప్పందమైనా ఉక్రెయిన్ భద్రతా పరమైన గ్యారెంటీలు ఉండాలని, ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు.
ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న రక్షణ సాయంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో జెలెనస్కీ ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. బైడెన్ హయాంలో ఉక్రెయిన్ కు గ్రాంట్ రూపంలో ఇచ్చిన నిధులను ట్రంప్ అప్పుగా పరిగణించడంతో ఉక్రెయిన్ ఉలిక్కి పడింది. అయినప్పటికీ యుద్ధం కీలక స్థాయికి చేరిన వేళ అమెరికా సాయం ఆగిపోతే తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనతో జెలెనస్కీ ఉభయతారకంగా కొత్త ప్రతిపాదనలు చేయడం విశేషంగా చెబుతున్నారు. అయితే పూర్తిగా అమెరికాకు తలొగ్గే పరిస్థితి లేదని జెలెనస్కీ చెప్పడం అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది.