రష్యాను కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ చేతికి ‘స్టార్మ్ షాడో’.. ఇంతకీ దాని కథేంటి..?

రెండేళ్లు పైనే అవుతున్నా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-13 21:30 GMT

రెండేళ్లు పైనే అవుతున్నా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు తగ్గకపోగా.. రోజురోజుకూ దాడులను తీవ్రం చేస్తున్నాయి. ఫలితంగా ఇరు దేశాల్లోనే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఒక దేశంపై మరో దేశం పైచేయి సాధించేందుకు రెండేండ్లుగా కష్టపడుతూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధాన్ని మరింత పెంచుతున్నారు.

ఇప్పటికే రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. క్షిపణి దాడులు చేస్తూ ఆ దేశంపై దాడులు చేస్తోంది. ఈ దాడుల ద్వారా ఇప్పటికే చాలా వరకు ఉక్రెయిన్‌కు డ్యామేజీ ఏర్పడింది. అటు.. ఉక్రెయిన్ సైతం రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో జెలెన్‌స్కీ మరో తరహా యుద్ధానికి తెరతీసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

తమ దేశానికి ఎంతగానో డ్యామేజీ చేసిన రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. ఆ దేశ భూభాగంలోకి మరింత చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలా వెళ్లి రష్యాపై పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇందుకు దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను వినియోగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

‘స్టార్మ్ షాడో’ క్రూజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్ దేశానికి అందించేందుకు బ్రిటన్ సైతం ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్టెల్త్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ క్షిపణిని గాలి ద్వారా ప్రయోగిస్తారు. ఈ క్షిపణిని బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని ద్వారా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఢీకొట్టవచ్చంట. దీనిని ఉక్రెయిన్ దేశం సేకరించి.. రష్యా, ఉక్రెయిన్ భాగం పరిధిలో యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

1994లో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని వినియోగిస్తే భారీ ఎత్తున విధ్వంసం జరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ ‘స్టార్మ్ షాడో’ అనేది బ్రిటీష్ పేరు. ఫ్రాన్స్ మాత్రం ఈ క్షిపణులను ‘ఎస్‌సీఏఎల్‌పీ-ఈజీ’ అని పిలుస్తోంది. వీటిని ఇతర దేశాలకు సరఫరా చేయాలంటే వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 300 కిలోమీటర్ల రేంజ్, 500 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉన్న మిస్సైల్స్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం అంత ఈజీ కాదు. ఎంటీసీఆర్ వ్యవస్థాపక సభ్యదేశం బ్రిటన్ కావడంతో..ఆ దేశం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ దేశాల మధ్య ఓ అవగాహన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉక్రెయిన్‌కు ఈ క్షిపణులను అందించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

Tags:    

Similar News