ఒకే ఒక్కడు పవన్...ఏపీకి ఆశా కిరణం ?

ఈ మాటలు అన్నది ఎవరో కాదు రాజకీయంగా తల పండిన వారు అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

Update: 2025-02-19 03:32 GMT

ఈ మాటలు అన్నది ఎవరో కాదు రాజకీయంగా తల పండిన వారు అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కితాబు ఇచ్చారు. ఏపీకి ఆశా కిరణం పవన్ అంటూ పొగిడారు. ఏపీకి సంబంధించి ఏమి చేయాలన్నా కేంద్రంతో మాట్లాడి ఏపీకి న్యాయం చేయాలన్నా కూడా అది పవన్ ఒక్కడికే సాధ్యం అని అన్నారు.

ఉండవల్లి ఇంతలా పవన్ ని పొగుడుతూ కామెంట్స్ చేయడానికి కారణం ఉంది. ఏపీ విభజన హామీలు అన్నీ దశాబ్దాల కాలం గడచినా కూడా ఏ మాత్రం నెరవేరడం లేదు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో సాయం అందడం లేదు. ఏపీకి ఇద్దరు సీఎంలు పనిచేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అయితే జగన్ ఒకసారి పనిచేశారు.

అయితే ఈ ఇద్దరి ఏలుబడిలో కేంద్రం నుంచి విభజన హామీలు సాధించడంలో విఫలం అయ్యారని ఉండవల్లి అంటున్నారు. దాంతో ఇక పవన్ మాత్రమే రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటూ ఆయన కితాబు ఇచ్చారు. ఏపీలో కూటమి సారధిగా ఉన్న చంద్రబాబు కంటే అలాగే విపక్షంలో ఉన్న జగన్ కంటే పవన్ చాలా బెటర్ అని ఉండవల్లి ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు.

ఏపీకి విభజన హామీలు నూరు శాతం సాధించే సత్తా పవన్ ఒక్కడికే ఉందని ఆయన అన్నారు. ఆ దిశగా పవన్ కృషి చేయాలని కోరుకుంటున్నట్లుగా ఉండవల్లి చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని రాజకీయ పార్టీల మీద ఆధారపడి నడుస్తోందని ఉండవల్లి అన్నారు.

ఈ సమయంలోనే విభజన హామీలను సాధించుకోవాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో ఎంత చేయాలో అంత చేయాలని కేంద్రం మీద ఒత్తిడి తీవ్రంగా పెట్టాలని ఆయన కోరారు. కేంద్రం నుంచి విభజన హామీల కింద ఏకంగా 75 వేల 50 కోట్ల రూపోఅయలు రావాల్సి ఉందని ఉండవల్లి అన్నారు.

ఇవన్నీ పక్కాగా లెక్కతో ఉన్నవే. కేంద్రం ఇచ్చి తీరాల్సినవే అని ఆయన అన్నారు. అందుకే తాను పవన్ కి లేఖ రాశాను అని ఆయన చెప్పారు. ఏపీకి సంబంధించి విభజన హామీల మీద పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఆ లేఖలో పవన్ ని కోరినట్లుగా ఉండవల్లి చెప్పారు.

కేంద్రం వద్ద బీజేపీ పెద్దల వద్ద ఎంతో పలుకుబడి ఉన్న పవన్ మాత్రమే ఏపీకి విభజన హామీలు అన్నీ సాధించగలరని ఆయన అన్నారు. ఆ నమ్మకం తనకు పూర్తిగా ఉందని చెప్పారు. దీని కోసం ఆయన లోక్ సభలో నోటీసు ఇవ్వాలని చెప్పారు. ఆ నోటీసు ఎలా ఇవ్వాలో కూడా తాను లేఖలో వివరించాను అని ఉండవల్లి చెప్పారు

ఏపీకి సంబంధించి విభజన హామీల మీద అమిత్ షాతో చర్చిచడానికి సిద్ధం అని చాలా సార్లు పవన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ లో చర్చించే నిర్ణయం తీసుకోవాలని పవన్ కి ఆయన సూచించారు. విభజన బిల్లు పార్లమెంట్ లో ఆమోదించిన రోజు ఫిబ్రవరి 18 అని ఆయన గుర్తు చేశారు.

ఇకి విభజన హామీలలో చెప్పిన విధంగా లక్షా 42 వేల 600 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదని ఉండవల్లి ఒక కొత్త విషయాన్ని చెప్పరు. అందులో చూస్తే కనుక తెలంగాణాకు 42 శాతం వాటా వెళ్ళగా మిగిలినది 75 వేల 40 కోట్లు ఏపీకి దక్కుతుందని అన్నారు. అంతే కాదు విభజన చట్టంలో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విభజించలేదని ఉండవల్లి చెప్పారు. తనకు పవన్ మీద ఈ విషయంలో నమ్మకంతో పాటు ఆశ కూడా ఉందని అన్నారు. మొత్తానికి పవన్ ని పొగుడుతూనే పెద్ద భారమే పెట్టారు ఉండవల్లి.

నిజంగా చూస్తే కనుక బీజేపీ పెద్దలు పవన్ పట్ల అభిమానంతో ఉన్నారు. వారి రేపటి ఏపీ రాజకీయానికి పవన్ ఒక వారధిగా నిలుస్తారని భావిస్తున్నారు. దాంతో పవన్ ఏదైనా చెబితే వినే పరిస్థితి ఉంటుందని ఉండవల్లితో పాటు చాలా మందికి ఉంది. మరి పవన్ ఏపీ తరఫున బాధ్యత తీసుకుని దక్కాల్సినవి అన్నీ దక్కిస్తే ఆయన చరితార్ధుడు అవుతారు. పవన్ ఈ విషయంలో అడుగులు ముందుకు వేయాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News