రామోజీ విషయంలో అదే తీవ్ర నిరాశ అన్న ఉండవల్లి !
ఆ సంగతి పక్కన పెడితే ఉండవల్లి ఏనాడూ రామోజీరావుని తక్కువ చేసి మాట్లాడలేదు అని అంటారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ. ఆయన దాదాపుగా దశాబ్దరన్నకు పైగా మార్గదర్శి సంస్థల విషయంలో న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. నిబంధనలను విరుద్ధంగా చిట్స్ వసూల్ చేశారు అన్నది ఆయన అభియోగం. ఆ సంగతి పక్కన పెడితే ఉండవల్లి ఏనాడూ రామోజీరావుని తక్కువ చేసి మాట్లాడలేదు అని అంటారు.
పెద్దలు రామోజీరావు గారు ముందు తాను ఎంత అని కూడా ఉండవల్లి అనేక సార్లు ప్రెస్ మీట్ లో అన్న సందర్భగాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే రామోజీరావు అస్తమయం పట్ల ఉండవల్లి స్పందించారు. ఆయన మరణం తీవ్ర లోటుగానే అభివర్ణించారు. భగవద్గీత లో చెప్పినట్లుగా మనిషికి మరణం తధ్యమని ఆయన అంటూ రామోజీరావు గొప్ప జీవితం గడిపారు అన్నారు.
ఆయన ఏ రంగంలో ఉన్నా సెలిబ్రిటీగానే ఒక స్థాయిలో ఉన్నారని అన్నారు. రామోజీరావు కేవలం తెలుగు నాట మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కీర్తిని గడించారు అని అన్నారు. తనకు జీవితంలో ఉన్న ఒకే ఒక అసంతృప్తి ఏంటి అంటే రామోజీరావుని జీవితంలో కలవలేకపోవడమే అన్నారు. తాను రామోజీరావుని కలవాలని చాలా సార్లు ప్రయత్నించాను కానీ అది వీలు పడలేదని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నటుగా ఉండవల్లి చెప్పారు.
ఇదిలా ఉంటే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అప్పటి రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనాడు గ్రూప్ సంస్థ మార్గదర్శి పై తీవ్ర ఆరోపణలు చేయడం కోర్టులో పిటిషన్ లు వేయడం తెలిసిందే. మధ్యలో వైఎస్సార్ మరణించినా అరుణ్ కుమార్ తన పోరాటం మాత్రం ఎక్కడా విడవలేదు. ఆయన అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఆయన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరఫున మార్గదర్శికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయించడంలోనూ సక్సెస్ అయ్యారు.
అయితే ఆ పోరాటం ఒక ఎత్తు ఒక వ్యక్తిగా వ్యవస్థగా రామోజీరావు ఎపుడూ గొప్పవారే అని ఉండవల్లి అంటున్నారు. ఆయన ఖ్యాతి ఎవరికీ లేదని రాదని కూడా ఆయన అంటున్నారు. రామోజీరావు తన జీవితంలో ఎపుడూ ఒక పోరాట యోధుడిగానే బతికారని ఎక్కడా రాజీ పడలేదని అన్నారు.
తాను తలపెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన ఎంతగానో రాణించారు అని అన్నారు. రామోజీరావు లా దేశంలో ప్రభావితం చేసిన వారు వేరొకరు లేరని కూడా ఉండవల్లి అన్నారు. మొత్తానికి ఉండవల్లి రామోజీరావుకు నివాళులు అర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి.