వాటితో మనదేశంలో 80 కోట్ల మంది దరిద్రం వదిలింది!

స్మార్ట్‌ ఫోన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించే ఇప్పుడంతా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ ఫోన్లతో మనకు మంచి కూడా జరిగింది

Update: 2024-08-02 13:30 GMT

స్మార్ట్‌ ఫోన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించే ఇప్పుడంతా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ ఫోన్లతో మనకు మంచి కూడా జరిగింది. ఇదే విషయాన్ని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి స్పష్టం చేయడం విశేషం.

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించడం ద్వారా మనదేశంలో ఏకంగా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ 80 కోట్ల మంది స్మార్ట్‌ ఫోన్‌ ను ఉపయోగించి గత ఆరేళ్లలో పేదరికం నుంచి బయటపడ్డారని వివరించింది.

ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు. భారత్‌ లో డిజిటల్‌ విప్లవం చోటు చేసుకుందన్నారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్‌ సేవలు విస్తరించాయని తెలిపారు. ఈ క్రమంలో కేవలం స్మార్ట్‌ ఫోన్లను వినియోగించడం ద్వారానే ఏకంగా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఫ్రాన్సిస్‌ వెల్లడించారు.

గతంలో భారత్‌ లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు ఉండేవి కావన్నారు. అలాగే ఆన్‌ లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు కూడా లేవన్నారు. దీంతో రైతులు బ్యాంకులతో సంబంధం లేకుండానే ఉండిపోయేవారన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకింగ్‌ వ్యవస్థతో సంబంధం లేని గ్రామీణ రైతులే లేరన్నారు.

దేశంలో గ్రామీణ రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే చేసుకుంటున్నారని వివరించారు.

బ్యాంకింగ్‌ సేవలను సులభతరం చేయడానికి ఇంటర్‌ నెట్‌ విస్తరించడం సహకరిస్తోందన్నారు. అలాగే దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇంటర్‌ నెట్‌ వ్యాప్తి తోడ్పడుతుందని ఫ్రాన్సిస్‌ అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలో మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్‌ నెట్‌ వ్యాప్తి, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం ద్వారా పేదరికం నుంచి బయటపడొచ్చని చెప్పారు.

కాగా కేంద్ర ప్రభుత్వం గత దశాబ్దకాలంగా డిజిటల్‌ ఇండియాపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. ఈ క్రమంలో 2016లో పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకు ఏటీఎంల్లో నగదు విత్‌ డ్రాలకు పరిమితులు విధించింది. దీంతో అంతా యూపీఐ డిజిటల్‌ చెల్లింపులపైనే ఆధారపడ్డారు. దీంతో డిజిటల్‌ లావాదేవీలు అమాంతం పెరిగాయి.

బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు జమ సులువైంది. వివిధ పథకాల నగదు లబ్ధి, సొంత వ్యాపారాల ద్వారా వచ్చే చెల్లింపులు నేరుగా గ్రామీణ ప్రాంతాల ప్రజల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతోంది.

Tags:    

Similar News