సహజీవనం కూడా రిజిస్టర్ చేయాల్సిందే! : ఉత్తరాఖండ్ సర్కారు సంచలన నిర్ణయం
యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌరస్మృతి) బిల్లుకు సంబంధించి బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది
యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌరస్మృతి) బిల్లుకు సంబంధించి బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం రెండేళ్ల కిందటే తీసుకువచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా ముసాయిదా బిల్లును రూపొందించుకుని దానిని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అనంతరం.. దీనిని కేంద్రానికి పంపితే.. అప్పుడు పార్లమెంటులో చర్చించి ఆమోదం తెలుపుతారు.
అయితే..తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూపొందించిన యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా బిల్లులో కొన్ని వివాదాస్పద అంశాలను పేర్కొంది. వీటిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
1) బహుభార్యత్వంపై సంపూర్ణ నిషేధం విధించాలి
2) సహజీవనం చేస్తున్న జంటలు కూడా ప్రభుత్వంవద్ద రిజిస్టర్ చేయించుకోవాలి.
3) కుమారులతో సహా కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన వాటా అడిగే హక్కు ఉంటుంది.
ఈ మూడు అంశాలు కూడా వివాదంగా ఉన్నాయనేది నిపుణుల మాట. ఎందుకంటే.. సహజీవనాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్థించిన తర్వాత.. దానికి రిజిస్ట్రేషన్ అనే మాట ఉత్పన్నం కాలేదు. వాస్తవానికి వివాహాలకు రిజిస్ట్రేషన్ ఉంది. ఇక, సహజీవనానికి రిజిస్ట్రేషన్ తీసుకురావడం ద్వారా కొత్త వివాదానికి ఉత్తరాఖండ్ సర్కారు తెరదీసింది.
అదేవిధంగా బహుభార్యత్వంపై సంపూర్ణ నిషేధం కూడా వివాదంగా మారింది. విడాకులు తీసుకున్న కుటుంబాల్లో అయితే.. రెండో పెళ్లిని అనుమతిస్తున్నారు. కానీ, ఇప్పుడు బహుభార్యత్వం దేనికి, ఏ వర్గానికి ఆపాదిస్తూ చేశారనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా సమాన వాటా విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తీసుకువచ్చిన బిల్లులో 33 శాతం వాటా మహిళలకు కుటుంబ ఆస్తిలో హక్కుగా సంక్రమిస్తుండగా.. ఉత్తరాఖండ్ మాత్రం 50 శాతం పేర్కొనడం గమనార్హం.