చంద్రబాబు అసలు యుద్ధం.. ఇదే.. !
సీఎం చంద్రబాబుకు అసలు సమస్య ఇప్పుడే ప్రారంభమైంది.
సీఎం చంద్రబాబు కు అసలు సమస్య ఇప్పుడే ప్రారంభమైంది. నిజానికి ఆయన చెబుతున్నట్టుగా యుద్ధం గెలిచామని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను గట్టెక్కించామని అంటున్నారు. ఇది వాస్తవమే కావచ్చు. వారం రోజులు పాటు వరద నీటిలో మునిగిన ప్రజలను ఆహారం నీరు ఇతర నిత్యవసర సరుకులు ఇవ్వడం ద్వారా కొంతమేరకు ఉపశమనం అయితే కలిగించారు. కానీ, వరదల కారణంగా జరిగిన నష్టం మాత్రం అపారంగా ఉంది. ఒక్కొక్క ఇంట్లో కూడా హీనపక్షం ఒక టీవీ ఒక రిఫ్రిజిరేటర్ వంటివి పూర్తిగా పాడైపోయాయి. ఇక కట్టుకునే బట్టలు లేకుండా కూడా పోయాయి.
మరికొందరికి గుడిసెలు పూర్తిగా నిలమట్టమయ్యాయి. పక్కా భవనాలు కూడా కొన్నిచోట్ల బీటలు ఇచ్చాయి. ఇది ఒక రకంగా భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పైకి చెప్తున్నట్టుగా వరద బాధితులు అయితే హ్యాపీగా ఏమీ లేరు. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం పరంగా తాము విజయం సాధించామని ఆయన చెబుతున్నారు. సరే ఐదు రోజులు పాటు చంద్రబాబు నిరంతరం వరద నీటిలో ప్రయాణం చేయటం, బాధితులకు ఓదార్పు ఇవ్వడం.. ఉదారంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే ఆయన ఒక రకంగా బాధితులను ఓదార్చే విషయంలో గత ముఖ్యమంత్రి జగన్తో పోల్చుకుంటే విజయం సాధించారని భావించవచ్చు.
కానీ ఇప్పుడు అసలు యుద్ధం చేయాల్సింది కేంద్రం మీద. ఎందుకంటే వరద నష్టం ఎంత జరిగిందని చంద్రబాబు స్వయంగా కేంద్రానికి నివేదిక పంపించారు. 6880 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా చెప్పుకొచ్చారు. ఇక పూర్తిస్థాయి నష్టంపై మరో నివేదిక ఇస్తామని కూడా చంద్రబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక ఎప్పుడు ఇస్తారు? అనేది పక్కన పెడితే ప్రస్తుతం ప్రాథమికంగా ఇచ్చిన నివేదికను గమనిస్తే 6880 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లందని కేంద్రానికి చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం ఎంత సాయం చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన సమస్య.
కేంద్రంలోని కూటమిలో చంద్రబాబు కూడా ఉన్నారు. మోడీని బలపరుస్తున్నారు. కాబట్టి ఆ మేరకు సాయం అందించాలి. బీహార్ వంటి రాష్ట్రాల్లో అయితే ఇటువంటి నష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా కేంద్రం పైన ఆధారపడి వెంటనే తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఏ మేరకు కేంద్రం దగ్గర సక్సెస్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ప్రస్తావించారు.
కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలని కూడా సూచించారు. అంటే ఇప్పుడు గనక చంద్రబాబు తాను ఇచ్చిన ప్రాథమిక అంచనా ప్రకారం అయినా 6880 కోట్లలో సగమైన తీసుకురాకపోతే రాజకీయంగా ఆయన కు ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పించుకునే అవకాశం కనిపించట్లేదు. అదే సమయంలో కేంద్రంలో మద్దతు ఇచ్చి కూడా ఏమీ సాధించలేకపోయారన్న విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. చూడాలి మరి ఏం చేస్తారో.