కేంద్రమంత్రి కుమార్తెకు లైంగిక వేధింపులు.. సీఎం రియాక్షన్ ఇదే!

కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.;

Update: 2025-03-02 11:23 GMT

కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... జల్ గావ్ జిల్లా ముక్తాయ్ నగర్ లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొంతమంది యువకులు వేధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శాంతిభద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అవును... మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారని.. ఇదే క్రమంలో ఇటీవల నిర్వహించిన యాత్రకు తన కుమార్తె స్నేహితులతో కలిసి వెళ్తానని కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించానని తెలిపారు. ఈ సమయంలో కొంతమంది యువకులు వారిని వెంబడించి వేధించారని ఆమె పేర్కొన్నారు.

ఈ సమయంలో వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. అయితే.. తాను గుజరాత్ పర్యటన నుంచి తిరిగి రాగానే ఈ విషయం తనకు చెప్పిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఓ ఎంపీ లేదా కేంద్రమంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

దీంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. డబుల్ ఇంజిన్ సర్కార్ లో అదే సర్కార్ కు చెందిన కేంద్రమంత్రి కుమార్తెకు ఇలాంటి దుస్థితా అనే చర్చ తెరపైకి వచ్చింది! ఈ సందర్భంగా స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్... మహాయుతి ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.

ఇలా ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవ్వడంతో పాటు రాజకీయంగాను పెను దుమారం రేపీంది. ఈ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని.. ఇది చౌకబారు చర్య అని.. అందులో కొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారని.. నిందితులను వదిలిపెట్టబోమని అన్నారు.

మరోపక్క ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి స్పందిస్తూ.. అనికేత్ ఘుయ్, అతని 6 మంది స్నేహితులు కలిసి ముగ్గురు, నలుగురు బాలికలను లైంగికంగా వేధించారని.. దీంతో.. వారిపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింది కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News