జైల్లోని ఖైదీలకు మహాకుంభ పుణ్యస్నానాలు.. ప్రభుత్వం ఏర్పాట్లు ఇవీ

మరి జైల్లో ఉండి నదీస్నానం చేయాలనుకునే వారి సంగతి ఏంటి? ఇప్పుడు అలా జైల్లో ఉన్న ఖైదీల కోరికను తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది..

Update: 2025-02-19 15:10 GMT

100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ హిందువు కూడా ప్రయాగ్ రాజ్ కు వచ్చి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే బయట ఉన్నవారంతా యూపీ దారి పడుతున్నారు. మరి జైల్లో ఉండి నదీస్నానం చేయాలనుకునే వారి సంగతి ఏంటి? ఇప్పుడు అలా జైల్లో ఉన్న ఖైదీల కోరికను తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది..

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలో, కుంభమేళాలో పాల్గొనలేని ఖైదీల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలో 90 వేలకుపైగా ఖైదీలకు గంగా జలాలతో స్నానం చేసే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 21న త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలను సేకరించి ఆయా జైళ్లకు తరలిస్తామని తెలిపారు. జైళ్లలోని నీటితో గంగా జలాలను మిళితం చేసి ఖైదీలకు పవిత్ర స్నానం చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

స్నాన అనంతరం ఖైదీలు పూజలు, ఇతర క్రతువులు నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో తానూ పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. కుంభమేళాలో భక్తులు పాల్గొనే వీలులేని ఖైదీల కోసం చరిత్రలో తొలిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News