బాబా సిద్ధిఖీ హత్య కేసులో తెరపైకి మరో కీలక విషయం!
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు! ఈ సంఘటనతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో ఈ హత్యకేసు విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... అక్టోబర్ 12న ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. బాబా సిద్ధిఖీపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పోందుతూ ఆయన మరణించారు. అయితే... కాల్పుల అనంతరం సిద్ధిఖీని తీసుకెళ్లిన లీలావతి ఆస్పత్రివద్దకు ప్రధాన నిందితుడు కూడా వెళ్లాడంట.
కాల్పులు జరిపిన అనంతరం దుస్తులు మార్చుకున్న ప్రధాన నిందితుడు.. బాబా సిద్ధిఖీని తీసుకెళ్లిన ఆస్పత్రి బయటే సుమారు అరగంట పాటు అక్కడే ఉన్నాడని తాజాగా పోలీసులు వెల్లడించారు. కాల్పుల తర్వాత సిద్దిఖీ మరణించాడా.. లేక, బ్రతికే ఉన్నాడా అనే విషయం నిర్ధారించుకోవడం కోసమే అతడు ఆస్పత్రి బయట వేచి చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.
కాల్పులు జరిపిన అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా అన్నట్లుగా దుస్తులు మార్చుకున్న నిందితుడు.. ఆస్పత్రి బయట మిగిలిన జనాల మాదిరి వారి మధ్య నిల్చుని వేచి చూశాడని.. సిద్ధిఖీ పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడ నుంచి వెళ్లిపోయాడని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. బాబా సిద్ధిఖీపై జరిగిన కాల్పులకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ ను విచారించిన పోలీసులకు.. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉందని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో.. అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు చెప్పాడని పోలీసులు ఇప్పటికే తెలిపారు! ఈ నేపథ్యంలో... కాల్పుల అనంతరం సిద్ధిఖీ మృతిని కన్ ఫాం చేసుకోవడం కోసం అరగంట పాటు లీలావతి హాస్పటల్ బయట వేచి చూసినట్లు విచారణలో తేలిందని తెలిపారు!