బలవంతంగా మతం మారిస్తే.. యావజ్జీవ ఖైదే: సంచలన చట్టం
బీజేపీ పాలిత ప్రధాన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సంచలన చట్టం ఆమోదం పొందింది.
బీజేపీ పాలిత ప్రధాన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సంచలన చట్టం ఆమోదం పొందింది. బలవంతంగా మతమార్పిడులను ప్రోత్సహించే వారికి యావజ్జీవ ఖైదును విధించే ఈ చట్టానికి యూపీ అసెంబ్లీ మంగళవారం వివాదాల మధ్యే ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా హిందూత్వను ప్రోత్సహించే క్రమంలోనూ.. హిందూత్వను కాపాడే క్రమంలోనూ ``బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024``ను తీసుకువస్తామని.. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే.. ఇది కొంత ఎఫెక్ట్ కొడుతోందని గ్రహించిన కమల నాథులు దీనిపై స్వల్పంగానే స్పందించారు.
అయితే.. జాతీయస్థాయిలో వెలువరించిన బీజేపీ మేనిఫెస్టోలో మాత్రం ``బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024``ను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సోమవారం నాడు లోక్‌సభలో ప్రవేశ పెట్టి.. మంగళవారం ఆమోదించు కున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ బిల్లును లోక్‌సభ అలా ఆమోదించిందో లేదో ఆ వెంటనే యూపీలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రవేశ పెట్టడం.. ఆవెంటనే రాత్రి 7 గంటల సమయంలో ఆమోదించడం గమనార్హం. ఇదంతా నాటకీయ ఫక్కీలో జరిగిపోయిందని విపక్ష కాంగ్రెస్ సహా.. సమాజ్ వాదీ పార్టీలు నిప్పులు చెరిగాయి.
అయినా.. యోగి మాత్రం వెనక్కి తగ్గలేదు. పలువురు సభ్యులను సభ నుంచి బయటకు పంపించేసి మరీ దీనిని ఆమోదించు కున్నారు. దీంతో దేశంలో ``బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024`` ఆమోదించిన తొలి రాష్ట్రంలో యూపీ నిలిచింది. గతంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం(బీజేపీ) ఇలానే ఆమోదించింది. వ్యతిరేకించిన సభ్యులను బయటకు గెంటేసి మరీ ఎలాంటి పెద్ద చర్చా లేకుండానే ఆమోదించి.. తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు యూపీ కూడా ఇదే పని చేసింది.
దీనివల్ల ఏం జరుగుతుంది?
+ మోసపూరిత వివాహాలను అరికడుతుంది. అంటే.. చిన్న వయసులోనే యువతులను బలవంతంగా వివాహం చేసుకోవడం. ఇతర మతాల వారు కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం(యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉంది) వంటివాటికి అడ్డుకట్ట వేస్తుంది.
+ బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని నిరోధిస్తుంది: ఇతర మతాల్లోకి హిందువులను బలవంతంగా మత మార్పిడి చేసే సంస్తలు, వ్యక్తులను ఈ చట్టం నిరోధిస్తుంది. అంతేకాదు.. వీరికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడేలా ఈ చట్టంలో మార్పులు చేశారు.
+ మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను బెదిరించినా.. తాయిలాలు ఇచ్చినా నేరమే.
+ వివాహం చేసుకుంటామని వాగ్దానం చేసి లైంగిక దాడి చేసినా నేరంగా పరిగణిస్తారు.
+ ఇలాంటి వాటిపై బాధితులే ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. విషయం తెలిసిన వారు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు.
+ ఇలా నమోదయ్యే కేసులను నాన్‌బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు.