మోసాలకు అడ్డుకట్ట.. యూపీఐపై అదుపు.. జనానికి మేలు!

ఇప్పుడంతా టెక్ యుగం. ప్రతిదీ ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. ఇంటి నుంచి కదలకుండానే అన్నీ చక్కబెడుతున్నారు ప్రజలు. ఇలాంటివాటిలో నగదు చెల్లింపులు కూడా ఒకటి

Update: 2023-11-28 23:30 GMT

పల్లె పట్టణం అని తేడా లేదు.. విద్యావంతుడు.. రోజు కూలీ అన్న భేదం లేదు.. అవతలి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడన్న ఆలోచన లేదు.. అసలు మానవత్వం ఉన్నవారెవరైనా ఇలాంటి పనిచేయరన్న బుద్ధే లేదు.. కేవలం దొడ్డిదారిలో డబ్బు సంపాదించాలన్న ధ్యాస తప్ప.. తక్కువ సమయంలో కూడబెట్టుకోవాలన్న దుర్బుద్ధి తప్ప.. ఈ రోజుల్లో ఆన్ లైన్ మోసాల తీరిది. కంటికి కనిపించని శత్రువుగా మారి.. మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు మాయగాళ్లు. రోజుకు కొన్ని వేల మంది ఈ మోసాల బారినపడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో? అందుకనే కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇది అమలైతే ప్రజలకు చాలా మేలు.

అంతా ఆన్ లైన్ లోనే..

ఇప్పుడంతా టెక్ యుగం. ప్రతిదీ ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. ఇంటి నుంచి కదలకుండానే అన్నీ చక్కబెడుతున్నారు ప్రజలు. ఇలాంటివాటిలో నగదు చెల్లింపులు కూడా ఒకటి. అయితే, ఇదే అదనుగా నేరగాళ్లు రంగంలోకి దిగి ప్రజల ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. కాగా, నగదు చెల్లింపుల్లో కీలకమైనది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ). కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. అదే సమయంలో నేరగాళ్లకు అవకాశం ఇస్తుంది. ఇకపై అలాంటిది లేకుండా.. ఆన్ లైన్‌ లావాదేవీల మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

నిర్ణీత మొత్తం దాటితే.. నిరీక్షించాల్సిందే

యూపీఐ చెల్లింపుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థాయి మొత్తానికి మించి సాగే తొలి లావాదేవీని నిర్దిష్ట సమయం నిలిపి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏదైనా పొరపాటు జరిగినట్లుగా తేలితే.. ఆ లావాదేవీని రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించడమే దీని ఉద్దేశం. అయితే, కొత్త పద్ధతి కారణంగా డిజిటల్‌ లావాదేవీలో కొంత జాప్యం సహజం. అసలు మోసానికి గురి అవడం కంటే ఇదే ఉత్తమం కదా? అని అధికారులు చెబుతున్నారు. అందుకనే దాదాపు నాలుగు గంటల వ్యవధి తర్వాతే ట్రాన్సాక్షన్‌ను ప్రాసెస్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

రిటైల్ కు కాదు..

నాలుగు గంటల నిబంధన రిటైల్ కు వర్తించదు. ఈ తరహా లావాదేవీల్లో రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు మాత్రమే నాలుగు గంటల వ్యవధి నిబంధన విధించనున్నారు. ఐఎంపీఎస్‌, ఆర్‌ టీజీఎస్‌, నెఫ్ట్ తో పాటు యూపీఐ చెల్లింపులకూ కొత్త నిబంధనను అమలు చేయాలని చూస్తున్నారు. ‘‘కొత్తగా క్రియేట్‌ చేసిన ఖాతాలకు’’ ఇప్పటివరకు ఈ నిబంధన అమల్లో ఉంది. మొదటి 24 గంటల్లో రూ.5,000 చెల్లింపునకు మాత్రమే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఇక నెఫ్ట్ లో అయితే తొలి 24 గంటల్లో రూ.50 వేలు మాత్రమే పంపగల అవకాశం ఉంది. వీటికి భిన్నంగా గత చరిత్రతో సంబంధం లేకుండా.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీలన్నింటికీ (రూ.2 వేలు దాటితే మాత్రమే) నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనుండడం కొత్త నిబంధన ఉద్దేశం. ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న ఈ విధానానికి అమలు ప్రయత్నం మొదలుపెట్టారు. యూకో బ్యాంకు ఖాతాదారులకు పొరపాటున రూ.820 కోట్లు జమ అయిన ఉదంతమే తాజా నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News