ఆ ఒక్క మెయిల్.. ఉక్రెయిన్ పౌరులను భయపెట్టింది
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న ఉక్రెయిన్ పౌరులు ఇటీవల తీవ్ర ఆందోళనకు గురయ్యారు.;

అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న ఉక్రెయిన్ పౌరులు ఇటీవల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాలంటూ వారికి పొరపాటుగా ఒక మెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. అయితే అది కేవలం తప్పిదం అని అధికారులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన తర్వాత, అక్కడి పౌరులను ఆదుకునేందుకు అమెరికా మానవతా పెరోల్ కార్యక్రమం కింద తాత్కాలిక నివాసం కల్పించింది. ఈ క్రమంలో సుమారు 2.40 లక్షల మంది ఉక్రెయిన్‌కు చెందిన శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందారు.
అయితే ఇటీవల వీరందరికీ ఒక షాకింగ్ మెయిల్ అందింది. "మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం. మీరు ఇకపై అమెరికాలో ఉండటానికి ప్రయత్నించవద్దు. ఏడు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలి. లేదంటే ఫెడరల్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. చివరికి మిమ్మల్ని యూఎస్ నుండి బహిష్కరిస్తాం" అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ సందేశం ఉక్రెయిన్ పౌరుల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ విషయంపై తక్షణమే స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అధికార ప్రతినిధి, అది పొరపాటుగా వెళ్లిన సందేశమని తెలిపారు. ఉక్రెయిన్ పౌరులకు మంజూరు చేసిన మానవతా పెరోల్‌ను రద్దు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. పొరపాటు మెయిల్ అందుకున్న వారందరికీ తిరిగి సరైన సమాచారం ఇస్తూ మెయిల్స్ పంపించామని, వారి తాత్కాలిక నివాస హోదాలో ఎలాంటి మార్పు లేదని ఆయన భరోసా ఇచ్చారు.
అమెరికాలో వలస విధానాలు ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వలసలపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాల నుంచి వచ్చిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు DHS ప్రకటించింది. 2022 అక్టోబర్ తర్వాత ఈ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వచ్చిన దాదాపు 5,32,000 మంది ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నారు.
ఈ నేపథ్యంలో, గతంలో ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ శరణార్థుల తాత్కాలిక చట్టపరమైన హోదాను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పొరపాటుగా వచ్చిన మెయిల్ తమను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసిందని ఉక్రెయిన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, DHS వివరణతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని వలసదారుల భయాందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది.