అమెరికా అధ్యక్ష ఫలితం టై అయితే...?

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అధ్యక్షుడిగా విజయం సాధించాలంటే 270 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఒక వేళ ఇద్దరికీ 269 చొప్పున ఓట్లు వస్తే..?

Update: 2024-10-22 04:02 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు ఇంకా పట్టుమని రెండు వారాల సమయం కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు, విమర్శలు ప్రతి విమర్శలతో పాటు ఊహ ప్రతివ్యూహాలు రసవత్తరంగా మారుతున్నాయని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో సర్వే ఫలితాలు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతుండటం గమనార్హం.

వాస్తవానికి డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్న సమయంలో.. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారని పోల్స్ విడుదలయ్యేవి. అయితే కమలా హారిస్ ఎంట్రీ తర్వాత.. ట్రంప్ కంటే ఆమె లీడ్ లో ఉన్నారని కథనాలొచ్చేవి. ఇటీవల.. యుద్ధాలను ఆపే సమర్ధత విషయంలో ట్రంప్ వైపే అమెరికన్లు ఉన్నారని అంటున్నారు.

దీంతో... ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరివైపు అవకాశాలు ఉన్నాయనే విషయం చెప్పడం దాదాపు సాధ్యం కావడం లేదని అంటున్నారు! అంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా దాదాపు అన్ని పోల్స్ ఫలితాల అంచనాలు ఇద్దరి మధ్యా స్వల్ప వ్యత్యాసాన్నే చూపిస్తున్నాయి.

పైగా గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని పోల్స్ పై కూడా ఫుల్ హోప్స్ పెట్టుకోలేక పోతున్నారంట అమెరికన్లు. ఉదాహరణకు 2016 ఎన్నికల సమయంలో... రిపబ్లికన్ అభ్యర్థిని పోల్స్ తక్కువగా అంచనా వేశాయి. కానీ.. ఆ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ సంగతి అలా ఉంటే... ఫలితాల్లో టై అయితే ఎలా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అధ్యక్షుడిగా విజయం సాధించాలంటే 270 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఒక వేళ ఇద్దరికీ 269 చొప్పున ఓట్లు వస్తే..? దీనికి సమాధానం చెబుతున్నారు యూఎస్ ఎన్నికలు, ప్రెసిడెన్షియల్ నామినేషన్స్ గురించి రాసిన బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ లోని సీనియర్ ఫెలో ఎలైన్ కమార్క్.

ఇందులో భాగంగా... ఇలాంటి సమస్యల పరిష్కారానికి తమవద్ద ఓ మంచి రూల్ బుక్ ఉందని చెబుతున్నారు. ఇలా ఫలితం టై అయితే... అంతిమంగా ఎన్నిక యూఎస్ ప్రతినిదుల సభకు వెళ్తుంది.. అక్కడ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసి, ఎవరు అధ్యక్షుడు అవుతారనేదానిపై ఓటు వేస్తారని అన్నారు.

ఇందులో దేశంలోని 50 రాష్ట్రాలకూ ఒక్కో ఓటు ఉంటుంది. దీంతో... 26 ఓట్లు సాధించిన అభ్యర్థి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారు.

కాగా... అక్టోబరు 19 (శనివారం) నాటికి 538 పోల్ ట్రాకర్ రోజువారీ అంచనాల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ పై కమలా హారిస్ 2.1 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఈ సమయంలో... 5.3 శాతంగా ఉన్న న్యూట్రల్ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనే విషయంపై ఫలితాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News