విదేశీ విద్యార్థుల మీద భారీ బాంబ్ వేసిన ట్రంప్
అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో పలువురికి ఈమొయిల్స్ వచ్చాయి.;

అగ్రరాజ్యం అమెరికాలో భావస్వేచ్ఛ ఎక్కువన్న మాట తరచూ వినిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఆ వాదనల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని తేల్చి చెప్పేలా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో పలువురికి ఈమొయిల్స్ వచ్చాయి. వీటి సారాంశం.. మీ వీసా రద్దైంది. మీ దేశానికి మీరు వెళ్లిపోండని.
దీనికి కారణం.. విదేశీ విద్యార్థులు ఆందోళనల్లోనూ.. నిరసనల్లో పాల్గొనటమే. ఇలా పాల్గొన్న విద్యార్థుల్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ రాత్రికి రాత్రి వీసా రద్దు చేసినట్లుగా పేర్కొంటూ ఈమొయిల్స్ పంపారు. ఈ తరహా ఈమొయిల్స్ ను అందుకున్న వారిలో భారత విద్యార్థులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వీసాలు రద్దైన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని.. లేదంటే బలవంతంగా వారి దేశాలకుతరలిస్తామన్న హెచ్చరికలు చేయటం గమనార్హం.
విశ్వవిద్యాలయాల్లో జరిగిన వివిధ ఆందోనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విదేశీ విద్యార్థులతో పాటు.. ఆందోళనల్లో పాల్గొన్న వారికే కాకుండా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారికి కూడా ఇదే తరహాలో ఈమొయిల్స్ వెళ్లాయి. చివరకు ఈ పోస్టులకు లైకులు కొట్టిన వారికి వార్నింగ్ లు వెళ్లటం విశేషం. బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ వీసా నుంచి విదేశీ విద్యార్థులకు ఈమొయిల్స్ వెళుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ నుంచి అందుతున్న ఈ మొయిల్స్ లో.. ‘‘అమెరికా జాతీయ చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం.. మీ వీసా రద్దు అయ్యింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్సైంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కాలేజీ యాజమాన్యానికి తెలియజేయొచ్చు’’ అని పేర్కొంటున్నారు.
వార్నింగ్ మెసేజ్ లు.. ఈ మొయిల్స్ వచ్చిన వారు తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోం యాప్ ను ఉపయోగించుకోవాలన్న సూచన చేసింది. ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు.. భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు ఆందోళనకు గురి చేసేలా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వేచ్ఛగా.. ప్రజాస్వామ్య బద్దంగా అభిప్రాయాల్ని వెల్లడించే అగ్రరాజ్యంలో ఇకపై అలాంటివేమీ ఉండన్న హెచ్చరిక తాజా వ్యవహారం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.