అమెరికాలో ఏదో జరగబోతోంది: జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన సహచరులపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మండిపడ్డారు

Update: 2023-09-29 11:07 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన సహచరులపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి వీరు అతిపెద్ద ముప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాన విలువలను బలోపేతం చేయడం కంటే.. వ్యక్తిగత శక్తిని పెంచుకోవడంపైనే ట్రంప్‌ కు ఆసక్తి ఉందని బైడెన్‌ ధ్వజమెత్తారు. ఇందుకు రిపబ్లికన్లు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. రిపబ్లికన్ల మౌనం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు జో బైడెన్‌.. ట్రంప్‌ పై నేరుగా చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవే కావడం గమనార్హం. అరిజోనాలో తన సహచరుడు దివంగత జాన్‌ మెకైన్‌ స్మారకార్థం చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఆయన అనుచరుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. ''మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌'' అనే ప్రచార థీమ్‌ ను బైడెన్‌ మరోసారి పునరుద్ఘాటించారు. గత మిడ్‌ టర్మ్‌ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడిపోవడంతో.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఈ ఆలోచనను మరోసారి ముందుకు తెచ్చే అవకాశం ఉందని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకు ఏదో ప్రమాదం పొంచి ఉందన్నారు.

తుపాకీ గొట్టాలతో ప్రజాస్వామ్యాన్ని చంపలేరు బైడెన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేవలం ప్రజల మౌనం వల్లే ప్రజాస్వామ్యం చనిపోతుందన్నారు. ప్రజలు భ్రమలకు, నిరాశకు, వివక్షకు గురైనప్పుడు వారికి అత్యంత ముఖ్యమైన దానిని వదులుకోవడానికి సిద్ధపడతారని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దాదాపు ఏడాదికిపైగా సమయం ఉంది. వచ్చే ఏడాది నవంబర్‌ లో అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి డోనాల్డ్‌ ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. పలు సర్వేల్లోనూ బైడెన్‌ ను మించి ట్రంప్‌ కే ప్రజలు మద్దతు పలుకుతున్నారు.

ఈ నేపథ్యంలో తనకు పోటీగా ట్రంప్‌ ఉంటారని జో బైడెన్‌ భావిస్తున్నారు. ట్రంప్‌పై ఎన్ని ఆరోపణలున్నా.. రిపబ్లికన్లు ఆయనకు మద్దతుగా ఉన్నారని బైడెన్‌ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పైన, ఆయన అనుచరులపైన బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వల్ల అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించడం ద్వారా కలకలం రేపారు.

ప్రస్తుతం అమెరికాలో బైడెన్‌ రేటింగ్స్‌ అంతకంతకూ పడిపోతోంది. అంతేకాకుండా ఆయన వయసు కూడా 80 ఏళ్లు దాటింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్‌ పోటీ చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బలమైన పోటీ ఇచ్చేందుకు బైడెన్‌ తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. కిందటి మిడ్‌ టర్మ్‌ ఎన్నికల్లో మాదిరిగా ట్రంప్‌ పై విమర్శలతో ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే జో బైడెన్‌ తాజా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Tags:    

Similar News